నందిపేట్, ఆగస్టు 14 : జిల్లాలో కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పోలీసు నిర్బంధకాండకు అడ్డూఅదుపు లేకుండాపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో గురువారం పర్యటించిన జీవన్‌రెడ్డి.. పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ సానుభూతిపరుడు యాసిన్‌కు చెందిన టీ స్టాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి చాయ్ తాగారు. ఈ సందర్భంగా యాసిన్ పోలీసుల వేధింపులను జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తీవ్రంగా స్పందించిన ఆయన సీఐకి ఫోన్ చేసి చాయ్ అమ్ముకొని బతికే యాసిన్‌పై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేదంటే 10 వేల మందితో స్టేషన్‌ను ముట్టడిస్తానని హెచ్చరించారు.
పేదోళ్లపై పోలీసుల ప్రతాపమా?
ఆర్మూర్‌లో అధికార పార్టీ నేతల అండదండలతో పేకాట, మట్కా జోరుగా నడుస్తున్నాయని, విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, నల్లమట్టి స్మగ్లింగ్ సాగుతన్నదని వారిని పట్టుకోకుండా చాయ్ అమ్ముకొని బతికే పేదోళ్లపై పోలీసులు ప్రతాపం చూపడం ఏమిటని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి లాడ్జి పేకాటకు నిలయంగా మారిన సంగతి పోలీసులకు తెలియదా? అని ప్రశ్నించారు. మంత్రి పదవి రాలేదన్న కోపంతో సుదర్శన్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు తమ బంధువులైన పోలీస్ అధికారులను దింపి వారి అండతో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల అవతారమెత్తి జిల్లాను దోచుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు తొత్తులుగా..
బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ఇలాంటి చిల్లర పనులు చేశామా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టామే తప్ప పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలను వేధించిన చరిత్ర తమకు లేదన్నారు. కాంగ్రెస్‌కు తొత్తులుగా మారి అరాచకాలకు పాల్పడుతున్న పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్న వారు ఇంతకు మూడింతలు అనుభవిస్తారని హెచ్చరించారు.
బీఆర్ఎస్ శ్రేణులపై వేధింపులా..
కాంగ్రెస్ నేతల అరాచకాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు టార్గెట్ చేసి అక్రమ కేసులతో వేధిస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ అరాచక శక్తిగా మారారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, మైనార్టీ, మున్నూరుకాపు వర్గాలకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు కొమ్ముకాస్తున్నారని జీవన్‌రెడ్డి సీఐ దృష్టికి తీసుకొచ్చారు. కబ్జాదారులకు రక్షణ కల్పించడం ఏమిటి.. మీరు ప్రజలను కాపాడే పోలీసులా.. ప్రజలను హింసించే కాంగ్రెస్ కార్యకర్తలా? అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల ట్రాక్టర్లను కారణం లేకుండా సీజ్ చేస్తున్నారని, కార్యకర్తలు కనపడితే డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి మానవ హక్కులను ఉల్లంఘించారన్నారు.