బాన్సువాడ, మార్చి 20 : ఎన్నికల సమయంలో ప్రజలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని బీఆర్ఎస్ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మండిపడ్డారు. బాన్సువాడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.12వేలు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీలు ఇచ్చి, బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్లో నిధులు కేటాయించినా ఇప్పటివరకూ ఎక్కడా కట్టిందిలేదని, నిర్మిస్తే చూపాలని సవాల్ విసిరారు.
బాన్సువాడ నియోజకవర్గంలో రూ.2 లక్షల రుణమాఫీ కొంతమంది రైతులకే చేశారని తెలిపారు. సాగునీరులేక పంటలు ఎండుతుంటే, ని యోజకవర్గంలో ముగ్గురు నాయకులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం.. రైతు రుణమాఫీ, బోనస్, రైతుభరోసా తదితర అంశాల పై అసెంబ్లీలో నోరు ఎందుకు విప్పడం లేదని ప్ర శ్నించారు.
బాన్సువాడను జిల్లా చేయాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ పలుమార్లు ఉద్యమించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బాన్సువాడను జిల్లాగా ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు నాయకులు.. వర్గాలను ప్రోత్సహిస్తున్నారే తప్ప, రైతాంగానికి వారు చేసిందేమీలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిబాబా, మోచి గణేశ్, అఫ్రోజ్, రమేశ్ యాదవ్, గాండ్ల కృష్ణ, శంకర్, నర్సింహులు గౌడ్, మొగులయ్య, రాము లు, బాలయ్య, అంజయ్య, విఠల్, జీవన్‌కుమార్, అనిల్ కుమార్, రాజుకుమార్ పాల్గొన్నారు.