ఇందల్వాయి, డిసెంబర్ 2 : గురుకుల పాఠశాలలో స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థినిని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు గాను రాజారాం యాదవ్ సోమవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్పల్లిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలకు వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడ నీరసంగా ఉన్న ఓ బాలిక ఉన్నట్లుండి స్పృహ కోల్పోయింది. స్పందించిన రాజారాం యాదవ్ హుటాహుటిన ఆటో తీసుకొచ్చి ఆమెను ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో గురుకులాల వ్యవస్థ దెబ్బతిన్నదని, విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేడని, విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడానికి కార్పొరేట్లకు కొమ్ముగాయడానికి సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారన్నారు. ఓ పక్క ప్రభుత్వ విద్యావ్యవస్థ పరిరక్షణ కోసం విద్యా కమిషన్ను ఏర్పాటు చేశామని చెబుతూ, మరోపక్క కార్పొరేట్ల నుంచి కమీషన్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కుట్రలన్నింటినీ భవిష్యత్తులో బయట పెడుతామన్నారు.