ఆర్మూర్‌టౌన్, డిసెంబర్ 3: ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతున్నదని, కాంగ్రెస్ నాయకుడు వినయ్‌రెడ్డి కమీషన్లకు నంబర్‌వన్‌గా మారాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్‌లోని మున్సిపల్ కార్యాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. కార్యాలయంలోని ప్రతి విభాగానికీ వెళ్లి వివరాలు సేకరించారు. పీవీఆర్ అంటే ఆర్మూర్ ప్రజల దృష్టిలో పైసా వసూల్ రాజా అని అన్నారు. అక్రమ వసూళ్ల సునామీని సృష్టిస్తున్న పీవీఆర్.. యథేచ్ఛగా ల్యాండ్, సాండ్ మాఫియాల ఆగడాలకు పాల్పడుతున్నాడని, కల్లు బట్టీ నుంచి నల్ల మట్టి దాకా మామూళ్లు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.
బల్దియా కార్యాలయంలోని ఇంటి నంబర్లు ఇచ్చే గదిలో వినయ్‌రెడ్డి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, ఇంటి నంబర్ కోసం వచ్చిన వారిని కెమెరాల్లో చూసి, వారిని బయటికి పిలిపించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలోని అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వినయ్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పీవీఆర్ ఒత్తిళ్లకు లొంగి అవినీతికి పాల్పడిన, కొమ్ముకాసిన ఎంవీఐ, రెవెన్యూ అధికారులు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు జైలు పాలయ్యారని చెప్పారు.
ఇకనుంచి తానే రంగంలోకి దిగి అవినీతిపరుల భరతం పడుతానని హెచ్చరించారు. కాంగ్రెస్ దోపిడీకి గురవుతున్న బాధితుల పక్షాన పోరాడుతానని చెప్పారు. ఆర్మూర్‌లోని తన ఇల్లే అవినీతి కొండలకు రిపేరు చేసే గ్యారేజ్ అని, బాధితులు ఎప్పుడైనా తన ఇంటి తలుపులు తట్టవచ్చని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలు త్వరగా ఇవ్వాలని అధికారులను కోరారు. వినయ్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆయనవెంట బీఆర్ఎస్ నాయకులు పోల సుధాకర్, పూజ నరేందర్, గంగామోహన్ చక్రు, మీరా శ్రావణ్, మహేశ్, దోండి శ్యామ్, లతీఫ్ ఉన్నారు.
పచ్చని చెట్ల నరికివేత
ఆర్మూర్‌టౌన్, డిసెంబర్ 3: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం నుంచి పెర్కిట్ వరకు డివైడర్ల మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి మేతకు బలయ్యాయని జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన ‘నమస్తే ఆర్మూర్’లో ఆయన డివైడర్లలో నాటిన మొక్కలను పరిశీలించారు. తాము పెట్టిన మొక్కలు పెరిగి ఆహ్లాదాన్ని పంచితే పట్టణ ప్రజలు ఎంతో సంతోషించారని, కానీ ప్రస్తుతం వాటిని తొలగించడంతో నిరాశ చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా డివైడర్ల మధ్య కొబ్బరి, ఈత మొక్కలు నాటాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను కోరినట్లు జీవన్‌రెడ్డి తెలిపారు.