ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 21: రుణమాఫీ పేరిట రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరి మోగించింది. అన్నదాతలకు అండగా, ఆంక్షలు లేని రుణమాఫీ అమలు కోసం నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నా రు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నారు. బాన్సువాడలో మాజీ ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు పార్టీ ముఖ్య నేత లు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా రైతులకు మద్దతుగా చేపడుతున్న ధర్నాను అడ్డుకునేందుకు సర్కారు యత్నిస్తున్నది. ధర్నాలో పాల్గొనవద్దని మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు నోటీసులు జారీచేశారు.
రైతుల కోసం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు అన్నదాతలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి రైతులందరికీ రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడం సరికాదన్నారు.