మోర్తాడ్, ఏప్రిల్ 16: తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తేజస్వీ వ్యాఖ్యలు పూర్తిగా అవివేకమైనవని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, తెలంగాణ సాధనకోసం అమరులైన వారిని అవమానించేలా ఉన్నాయని ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంట్ ప్రక్రియ ద్వారా రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్థాన్‌తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని అభిప్రాయపడ్డారు.
బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తేజస్వీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుండడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని, బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య అహంకారపూరిత వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్థాన్ విభజనతో పోల్చడం అంటే పార్లమెంట్‌ను, 140 కోట్ల దేశప్రజలను అవమానపరచడమేనని పేర్కొన్నారు.
ఒకవేళ తెలంగాణ ఏర్పాటు అదేతరహాలో జరిగి ఉంటే విభజన బిల్లుకు బీజేపీ ఎందుకు మద్ధతు తెలిపిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. తేజస్వీ అవమానకరంగా మాట్లాడుతుండగా, పార్లమెంట్‌లోనే ఉన్న తెలంగాణకు చెందిన 8 బీజేపీ, 8 కాంగ్రెస్ ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అదే సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటే బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సంగతేటో తేల్చేవారని, పార్లమెంట్‌ను స్థంబింపజేసి వారికి తగిన సమాధానం ఇచ్చేవారని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ప్రజలు సహించరని, బీజేపీ నేతలు కొరివితో తలగోక్కో వద్దని హెచ్చరించారు.