లింగంపేట, జూలై 6: మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఓ బాలుడు రెండు రూపాయల కాయిన్ మింగాడు. వెంటనే కుటుంబీకులు దవాఖానకు తీసుకెళ్లడంతో వైద్యులు తొలగించారు. గ్రామానికి చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు కుమారులు. కుమారుడు తన్వీర్ (2) శనివారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో రెండు రూపాయల కాయిన్ మింగాడు.
బాలుడు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే లింగంపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. బాలుడికి పరీక్షలు నిర్వహించి ఎక్స్రే తీయగా గొంతులో రెండు రూపాయల కాయిన్ ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అత్యాధునిక పరికరాలతో కాయిన్ను వైద్యులు తొలగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.