Bhodhan | బోధన్, ఫిబ్రవరి 15 : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి హై స్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు కొనసాగిన ఈ వార్షికోత్సవం వేడుకల్లో హై స్కూల్ పూర్వ విద్యార్థి డాక్టర్ పోలవరపు కళ్యాణ్ చక్రధర్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. బోధన్ పట్టణానికి చెందిన పోలవరపు కళ్యాణ్ చక్రధర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ యూనివర్సిటీ పరిధిలోని అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.
వార్షికోత్సవంలో కళ్యాణ్ చక్రధర్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాల కిందట విజయ హై స్కూల్ స్థాపించినప్పుడు తొలి బ్యాచ్లో తాను విద్యను అభ్యసించానని గుర్తు చేశారు. ఈ స్కూల్లో నాణ్యమైన విద్యను బోధించడం, ప్రతి వారం క్రమం తప్పకుండా వివిధ సబ్జెక్టుల్లో క్విజ్ పోటీలు నిర్వహించడం వల్ల తనకు చదువుపై ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజంలోని వివిధ విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఇదే కార్యక్రమంలో కళ్యాణ్ చక్రవర్తి తల్లిదండ్రులుగా ఉన్న లయన్స్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు బసవేశ్వర రావు – లయన్ లక్ష్మి దంపతులు అతిథులుగా పాల్గొని విద్యార్థులకు సందేశాలను ఇచ్చారు. వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అద్యంతం అలరించాయి. గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 10/10 జీపిఏ సాధించిన 23మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను వారి తల్లిదండ్రులకు హైస్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో అందించింది. కార్యక్రమంలో శ్రీ విజయసాయి హైస్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణమోహన్ మేనేజర్ ఐఆర్ చక్రవర్తి, హై స్కూల్ ప్రతినిధులు రాజశేఖర్, ప్రసూన, సువర్చల తదితరులు పాల్గొన్నారు.