కామారెడ్డి : ఎక్కడైతే నేరాలు ఎక్కువగా జరుగుతాయో వాటిని బ్లాక్ స్పాట్ ( Black spots ) గా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జస్టిస్ డాక్టర్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ (Justice Dr. Varaprasad) పోలీసులకు సూచించారు.
శనివారం జిల్లా న్యాయస్థాన భవన సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ ( Lok Adalat ) ను ప్రారంభించి మాట్లాడారు. రోజురోజుకూ నేరాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని వాటిని నిరోధించి కోర్టుల పని భారాన్ని తగ్గించాలని కోరారు.
దేశంలో దాదాపు మూడు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి దాదాపు 250 సంవత్సరాలు పడుతుందని వివరించారు. వీటితోపాటుగా ఎప్పుడు మళ్లీ కొత్త కేసులు నమోదవుతాయని, వీటిని పరిష్కరించడంలో న్యాయమూర్తుల పాత్ర అతి ముఖ్యమైనదని తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 1, 014 కేసులులో అవార్డులు జారీ అయ్యాయని వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 2,065 కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ నాగరాణి , జూనియర్ న్యాయ అధికారులు కే సుదధాకర్, దీక్ష , ఏసీపీ చైతన్యా రెడ్డి , పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజగోపాల్ గౌడ్, అశోక్ దామోదర్ రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు సిద్ధ రాములు, శంకర్ రెడ్డి, శివరాత్రి ప్రతాప్, వాసుదేవరెడ్డి, అన్వర్ షరీఫ్, రజనీకాంత్, లత, బాల్రెడ్డి, షబానా బేగం, అంగరాజు, సలీం, వేణు ప్రసాద్ , టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ సీఐ రామన్ తదితరులు పాల్గొన్నారు.