బాన్సువాడ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy) తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తరువాతే ఎన్నికల్లో ఓట్లు అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి (Anji Reddy ) డిమాండ్ చేశారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని వాసవి స్కూల్, కాకతీయ స్కూల్, ఠాగూర్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Election) ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థులకు ఫీజ్ రియింబర్స్‌మెంట్‌పై (Fees Reimbursment) నెలల తరబడి విద్యార్థులు ఆందోళన చేస్తున్నాగాని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. మండలానికి ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ నెలకొల్పుతామని ప్రకటనలు చేశారని, ఎక్కడ కట్టిస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వల్ల ఆదాయం పన్ను పరిమితిని పెంచడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం రూ. 12 వేలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇంత వరకు నెరవేర లేదని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎంపీ బీబీ పాటిల్ రాబోవు రోజుల్లో దేశం అభివృద్ధి సాధించాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎన్నికల ఇన్చార్జి గంగారెడ్డి , పెద్దోళ్ల గంగారెడ్డి , పైడిమాల్ లక్ష్మీ నారాయణ, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి, గుడుకుంట్ల శ్రీనివాస్, కోణాల గంగారెడ్డి, సాయి కిరణ్, మోహన్ రెడ్డి, గంగాధర్, శంకర్ గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.