కంఠేశ్వర్, సెప్టెంబర్ 28: అభివృద్ధి పనుల్లో అంతులేని జాప్యం జరుగుతున్నదని ఎంపీ అర్వింద్ అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులపై చర్చించేందుకు అక్టోబర్ రెండోవారంలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం ద్వారా మంజూరైన పనులు ఏయే దశల్లో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ‘దిశ’ సమావేశంలో, సమావేశం అనంతరం విలేకరులతో అర్వింద్ మాట్లాడారు.
మాధవ్‌నగర్, అడవిమామిడిపల్లి, ఆర్మూర్‌లోని ఆర్వోబీ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సుదర్శన్‌రెడ్డి మంత్రి పదవి రాక అలిగిండన్నారు. ‘రేవంత్‌రెడ్డి.. సుదర్శన్‌రెడ్డికి త్వరగా మంత్రి పదవి ఇచ్చేయండి. ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు. లేకుంటే అలిగి కూర్చుంటాడని’ వ్యాఖ్యానించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాను పట్టించుకోవడం లేదని, ఫలితంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు నెలల నుంచి ఇన్చార్జి మంత్రి జిల్లాకు రాకపోతే అభివృద్ధి పనులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు.
ఇదిలాగే కొనసాగితే సెక్రటేరియట్‌లోని మంత్రి పేషిని పెట్రోల్ పోసి తగులబెడతానని వ్యాఖ్యానించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. జిల్లాలో ఎటువంటి కార్యక్రమం జరిగినా సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్ అంకిత, మున్సిపల్ కమిషనర్ మకరంద్ పాల్గొన్నారు.