నిజామాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కమల దళం కాడి వదిలేసింది. ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ పాలనలో జనం అనేక రకాలుగా చితికిపోతుంటే బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది. ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కారును నిలదీయకుండా మౌనముద్ర దాల్చింది. ఏడాది క్రితం వరకు బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శించారు.
ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నిప్పులు చెరిగారు. ప్రతి విషయంలోనూ శూల శోధన చేసి జనాల్ని ఆగమాగం చేశారు. రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు సైతం చేసి ప్రజలను మభ్యపెట్టారు. లేనిపోని కల్పిత ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే పనికి ఒడిగట్టారు. ఏమైందో ఏమో కానీ ఏడాది కాలంగా బీజేపీ మౌనవ్రతం ఆచరిస్తున్నది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సర్కారుతో స్నేహబంధం కొనసాగిస్తున్నది.
రేవంత్‌రెడ్డి సర్కారు కొలువు దీరి ఏడాది కావొస్తున్నది. 11 నెలల కాంగ్రెస్ పాలనలో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు సాయం అటకెక్కింది. రైతుభరోసాకు అతీగతీ లేకుండా పోయింది. బోనస్ బోగస్‌గా మారింది. వసతిగృహాల్లో పురుగుల భోజనం నిత్యకృత్యమైంది. విద్యార్థుల మరణాలు కలచివేస్తున్నాయి. ఆరుగ్యారంటీలు గాల్లో కలిశాయి. పింఛన్లు, కల్యాణలక్ష్మి అమలులో రేవంత్ సర్కారు విఫలమైంది. మహాలక్ష్మి కింద స్త్రీమూర్తులకు రావాల్సిన లాభం దక్కడం లేదు. సెప్టెంబర్ 17కే తెరుస్తామన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీకి అతీగతీ లేదు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నా బీజేపీ మౌనం దాల్చడం విస్మయానికి గురి చేస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై కమల దళం పోరుబాట పట్టకపోవడంపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఇన్ని సమస్యలు వెంటాడుతోన్న ప్రజల కోసం ఆశించిన స్థాయిలో గళం వినిపించకపోగా సైలెంట్ కావడంతో రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తున్నది. చీటికి మాటికి సోషల్ మీడియాకు ఎక్కి గత ప్రభుత్వంపై నిందలు మోపిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రెస్మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వదిలేసి ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఇతర అంశాలను భుజాన వేసుకుంటున్నారు. ఇలా బీజేపీ నేతల తీరుపై సొంత పార్టీలోనే జోరుగా చర్చ నడుస్తున్నది.
ఆది నుంచి కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా నిత్యం ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నది. ఆరుగ్యారంటీల హామీ అమలుపైనా నిలదీస్తున్నది. 11 నెలల పాలనలో కాంగ్రెస్ సర్కారును రోడ్డుకు ఈడ్చి ప్రజల్లో దోషిగా నిలబెట్టడంలో బీఆర్ఎస్ విజయవంతమైంది. కేసులకు భయపడకుండా, పోలీసుల వేధింపులను ధైర్యంగా ఎదుర్కొంటూ, గృహ నిర్భందాలను సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ నేతలు ప్రజా పోరాటంలో ముందుంటున్నారు.
సోయా రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు సమస్యపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గళమెత్తారు. ఆయన హెచ్చరికలతో స్పందించిన ప్రభుత్వం ఎకరానికి 6 క్వింటాళ్ల సీలింగ్‌ను 10 క్వింటాళ్లకు పెంచింది. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి సైతం ప్రజల్లోకి వెళ్తూ హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ప్రజా సమస్యలపై స్పందించడం లేదు. అధికార కాంగ్రెస్ నేతల ఆగడాలపైనా ప్రశ్నించడం లేదు. పైగా బీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు.
అకస్మాత్తుగా బీజేపీ నేతలంతా సైలెంట్ కావడం వెనుక కారణం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ మాత్రమే విద్యార్థుల సమస్యలపై అడపాదడపా ఆందోళనలు చేస్తున్నది. హిందుత్వ పోరాటాలకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కదం తొక్కుతున్నారు. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ మాత్రం అంతగా స్పందించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వర్‌రెడ్డి తనదైన శైలిలో సర్కారును ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వానికి రోజుకో విధంగా సవాళ్లు విసురుతున్నారు.
అయితే, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో దాడి అన్నది మచ్చుకు కనిపించకపోవడం విడ్డూరంగా మారింది. వారు సైలెంట్ కావడం వెనుక అధిష్టానం ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేతల అధికార దర్పానికి అనేక చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీస మర్యాద దక్కడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంలో కొట్టుమిట్టాడుతున్నది. కాంగ్రెస్ నేతలకు ఇచ్చే మర్యాద కూడా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు. ఇలాంటి గందరగోళంలోనూ బీజేపీ నేతలు మౌనంగా ఉండడమేమిటో అంతుబట్టడం లేదు.