నిజామాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓట్లేసిన జనానికి మేలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టింపులకు పోయి ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. రాజకీయ వైరంతో సామాన్యులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నవోదయ విద్యాలయ స్థాపనను వివాదాంశంగా మార్చేశాయి. రాజకీయ ప్రయోజనం కోసం కొట్లాడుతున్న రెండు పార్టీల తీరుతో అంతిమంగా జిల్లా ప్రజలకు అన్యాయమే జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం గతేడాది జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది.
వీలైనంత త్వరగా స్థాపించి ప్రజలకు మేలు చేయాల్సింది పోయి రెండు పార్టీలు రాజకీయం చేయడం ప్రారంభించాయి. ఈ గడ్డపై పుట్టిన బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించకుండా రాజకీయం చేస్తూ విద్యాలయాన్ని ప్రారంభించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో రెండు పార్టీలు వెనక్కి తగ్గక పోగా ఢీ అంటే ఢీ అంటున్నాయి. స్థల సేకరణను కొలిక్కి తేకుండా కొర్రీలు పెడుతుండడంపై జనాగ్రహం వెల్లువెత్తుతున్నది. మరోవైపు, రెండు పార్టీల నడుమ నలిగిపోతున్న అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసి ఉంటే వేలాది మందికి నాణ్యమైన విద్య లభించేది. కానీ కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది. ఆలస్యంగానైనా నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసినప్పటికీ, కార్యకలపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది స్పష్టత లేకుండా పోయింది. రానున్న (2025-26) విద్యా సంవత్సరంలోపు నవోదయ విద్యాలయాన్ని తాత్కాలిక ఏర్పాట్లతోనైనా ప్రారంభించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఈ విషయం లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని, లేకపోతే 2026-27 విద్యా సంవత్సరానికి ప్రారంభోత్సవం వాయిదా పడితే విద్యార్థులకు మరింత అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో పట్టు విడుపులకు పోకుండా బీజేపీ, కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని విన్నవిస్తున్నారు.
తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ఏపీ పునర్విభజన చట్టం 2014లో హామీ ఇచ్చారు. ఇతర కేంద్ర పరిశోధన సంస్థల ఏర్పాటుపైనా హామీలను యూపీఏ ప్రభుత్వం చట్టంలో పొందుపర్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. చట్టంలోని అనేక అంశాలను అటకెక్కించింది. అందులో విద్యాలయాల స్థాపన కూడా ఒకటి. 2014 నుంచి 2023 వరకూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రంపై పోరాటం చేసింది.
కేసీఆర్ సారథ్యంలో అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. మరోవైపు, బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా తరచూ ప్రశ్నించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్రం తీరును ఎండగట్టారు. తెలంగాణపై మోదీ సర్కారు చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. మొత్తంగా బీఆర్ఎస్ పోరాట ఫలితంగా కేంద్రం ఒక మెట్టు దిగి ఎట్టకేలకు నవోదయ విద్యాలయాల స్థాపనకు ముందుకొచ్చింది. నిజామాబాద్‌కు ఒక విద్యాలయాన్ని మంజూరు చేయగా, దీని ఏర్పాటులో కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుతో ప్రతిష్టంభన ఏర్పడింది.
నవోదయ ఏర్పాటులో కాంగ్రెస్, బీజేపీ నడుమ స్థల పంచాయితీ పేచీ నడుస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో ఏర్పాటు చేయాలని బీజేపీ పట్టుబడుతుంటే, బోధన్ నియోజకవర్గ కేంద్రంలో స్థాపించాలని కాంగ్రెస్ ఒత్తిడి తెస్తున్నది. మరోవైపు, ఈ వ్యవహారం అధికార హస్తం పార్టీలోనూ చిచ్చు రేపింది. నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో వైరం సృష్టించింది. నవోదయ స్థాపన విషయంలో మొన్నటిదాకా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు అనూహ్యంగా మౌనం పాటిస్తున్నారు.
మొన్నటిదాకా ఆందోళనలు, శవయాత్రలు జరిపిన రెండు పార్టీలు ఇప్పుడు చడీచప్పుడు చేయకపోవడంపై జనాల్లో చర్చ జరుగుతున్నది. నవోదయ ఏర్పాటుకు సువిశాలమైన ప్రాంతం అవసరమని, ఇందుకోసం కలిగోట్ వద్ద 30 ఎకరాలను కేటాయింపు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. బోధన్ నియోజకవర్గ కేంద్రంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన 8 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నవోదయ ఏర్పాటు విషయంలో ఒకడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్లు మారింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల డ్రామా..
నవోదయ విద్యాలయం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జిల్లాకు మంజూరైన నవోదయను స్థాపించేందుకు ఇరు పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయి. డ్రామాలు బంద్ చేసి అనువైన స్థలాన్ని గుర్తించి నవోదయ విద్యాలయాన్ని త్వరగా ఏర్పాటు చేసేందుకు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలి.
– చింత మహేశ్, తెలంగాణ ఉద్యమకారుడు
పదేండ్లుగా బీజేపీ సర్కారు తెలంగాణపై నిర్లక్ష్యం చూపింది. బీఆర్ఎస్ పోరాటంతో ఎట్టకేలకు జిల్లాకు నవోదయను మంజూరు చేసింది. నిజామాబాద్‌కు మం జూరైన నవోదయ విద్యాలయా న్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలి. ఇప్పటికే ఈ ప్రాంత బిడ్డలకు ఎంతో అన్యాయం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ ఇంకా జాప్యం చేసి మరింత అన్యాయం చేయొద్దు.