వినాయక్‌నగర్, ఫిబ్రవరి 10: బీజేపీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పలువురు నాయకుల వ్యవహార శైలి ఇందుకు అద్దంపడుతున్నది. అధిష్టానం తమకు నచ్చనివారికి బాధ్యతలను అప్పగించడంపై అంతర్యుద్ధమే కొనసాగుతున్నదని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా జిల్లా అధ్యక్షుడికి, అధిష్టానానికి సమాచారం లేకుండా కొంతమంది నాయకులు ప్రెస్మీట్లు పెట్టడం, సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడంతోనే అంతర్గత కలహాలు ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సాక్షాత్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి శనివారం విలేకరుల సమావేశంలో పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ పలువురు నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పడమే నిదర్శనంగా నిలుస్తున్నది.
నచ్చినట్లు వ్యవహరిస్తే వేటు తప్పదు..
బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని, కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే అంశం రాష్ట్ర నేతల వరకు వెళ్లిందని జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీలో కొందరు అధిష్టానానికి చెప్పకుండా, జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి అధ్యక్షులకు చెప్పకుండా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. బాధ్యులను సంప్రదించకుండా తమకు నచ్చినట్లుగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ వేటు వేస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోమని ముందుగా చెప్పిన తర్వాతే పార్టీ నిబంధనల ప్రకారం వివిధ హోదాల్లో అధ్యక్షులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కానీ నిబంధనలు అతిక్రమించి పలువురు తమ ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. పలువురు సోషల్ మీడియా, పత్రికల ద్వారా ప్రకటనలు చేస్తున్నట్లుగా అధిష్టానం దృష్టికి వచ్చిందని అలా చేసే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు, జిల్లా, మండలస్థాయి నాయకులు పాల్గొన్నారు.