కంఠేశ్వర్, ఆగస్టు 22: నిజామాబాద్ కలెక్టరేట్లో భద్రతా లోపాలు బయటపడ్డాయి. మంత్రి సమీక్షా సమావేశంలోకి ఓ పార్టీ శ్రేణులు చొచ్చుకురావడం భద్రతా వైఫల్యాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ వ్యవహారం కలెక్టరేట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు, బీఆర్ఎస్, ఇతర విద్యార్థి సంఘాలను ఉదయం నుంచే కట్టడి చేసిన పోలీసులు.. బీజేపీ శ్రేణులను మాత్రం వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మంత్రి పర్యటించే మార్గాల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ నేతలపై ఉదయం నుంచే ఆంక్షలు విధించారు. పలువురిని గృహనిర్బంధంలో పెట్టారు. కానీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి నేతృత్వంలో 50 మంది వరకు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకుని రావడం భద్రత లోపాన్ని ప్రస్ఫుటం చేయడమే కాకుండా, తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
పోలీసు వలయాన్ని దాటుకుని బీజేపీ శ్రేణులు కలెక్టరేట్‌లోకి రావడం, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకుల పట్ల పోలీసులు మెత క వైఖరి ప్రదర్శించడంతోనే ఇదంతా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కిన పోలీసులు.. బీజేపీ నాయకులను మాత్రం ఉపేక్షించడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్ సమావేశం మందిరం వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బైఠాయించి పొంగులేటి రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అప్పటికప్పుడు తేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు బీజేపీ డౌన్‌డౌన్, మోదీ డౌన్‌డౌన్ అంటూ ప్రతిగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోటాపోటీ నినాదాలతో కలెక్టరేట్లో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. ఉద్రిక్తత పెరుగుతుండడంతో పోలీసులు బీజేపీ నాయకులను బలవంతంగా లాక్కొని బయటికి తీసుకెళ్లారు. 22 ఏ విషయంలో తప్పు తనదేనని ఒప్పుకున్న పొంగులేటిని రేవంత్ సర్కారు ఎందుకు రాజీనామా చేయించడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ప్రశ్నించారు.