నిజామాబాద్, ఫిబ్రవరి 13,(నమస్తే తెలంగాణ ప్రతినిధి) కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి కింగ్ మేకర్‌గా నిలిచింది. అధికారలో ఉన్నప్పుడు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని సగర్వంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చలాయిస్తోంది. కేంద్రంలో బీజేపీ పాలిస్తోంది. కామారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఓటర్లంతా కలిసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ అందించారు.
రెండు జాతీయ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌లు కలిసి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అధికార పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేసి ధీటుగా నిలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పోలీసులు, ఎన్నికల యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇష్టారీతిన ప్రచారం చేసింది. ఎన్ని కుయుక్తులు, కుట్రలకు పాల్పడినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి పురపాలక పీఠాన్ని ఓటర్లు కట్టబెట్టలేదు.
మొత్తం 49 వార్డులున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 19, బీజేపీకి 16, బీఆర్ఎస్కు 11, స్వతంత్రులకు 3 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 25 కావడంతో కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా ఎన్నిక కావాలంటే బీఆర్ఎస్ ద్వారా గెలిచిన 11 మంది మద్ధతు అనివార్యమైంది. ఈ నెల 16న జరిగే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కింగ్ మేకర్ కాబోతుండగా బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ పాలనలో జరుగుతోన్న విధ్వంసాన్ని జనాలంతా గుర్తించి బీఆర్ఎస్ భారీగా వార్డు స్థానాల్లో గెలిపించారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ అచెంచలమైన నమ్మకంతో 11 స్థానాల్లో గులాబీ పార్టీకే ఓటర్లు మద్ధతు తెలిపారు.
బోధన్ మున్సిపాలిటీలోనూ అధికార కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. స్థానిక ఎమ్మెల్యేగా క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ప్రజలంతా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని పీఎస్ఆర్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పట్టణంలో గడిచిన రెండేళ్లలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. అభివృద్ధి అన్నది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ హామీ కేవలం మాటలకే పరిమితం చేశారు. మొన్నటి మొన్న సీఎం సభలోనే షుగర్ ఫ్యాక్టరీ రాదన్నట్లుగానే పి.సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గ్రహించిన ఓటర్లంతా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని విశ్లేషకులు చెబుతున్నారు. బోధన్‌లో 38 వార్డులకు 20 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. 17 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే పీఎస్ఆర్కు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు ఉంది. అయినప్పటికీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు మెజార్టీ సరి పోవడం లేదు. అనివార్య పరిస్థితిలో బోధన్ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు ముందస్తు ఒప్పందంలో భాగంగా ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపనుంది. బోధన్ పురపాలక సంఘంలో ఎంఐఎంకు 12, బీఆర్ఎస్కు 5, బీజేపీకి 3, స్వతంత్ర ఒకరు గెలిచారు.
బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పోరాడి ఓడింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వరుసగా మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేశారు. కంకణం కట్టుకుని ప్రచారం చేశారు. అధికార పార్టీ దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పటికి స్వల్ప ఓట్లతో రెండు చోట్ల వార్డు స్థానాలు కోల్పోవడంతో కాంగ్రెస్‌కు భీమ్‌గల్ పురపాలక సం ఘం దక్కింది. మరో 2 వార్డులు బీఆర్ఎస్కు వచ్చి ఉంటే ఎక్స్ అఫిషియో ఓట్లతో భీమ్‌గల్ పురపాలక పీఠాన్ని సులువుగా దక్కించుకునేది. 8 వార్డులు కాంగ్రెస్ పార్టీకి, 4 వార్డులు బీఆర్ఎస్కు దక్కాయి. బీజేపీ ఇక్కడ గల్లంతైంది. కనీసం ఖాతా కూడా తెరువలేక పోయింది. ఆర్మూర్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్కు 5 చోట్ల విజయం దక్కింది. కాంగ్రెస్ పార్టీకి పురపాలక పీఠం వరించింది. కాంగ్రెస్ 19, బీజేపీ 8, ఎంఐఎం 1, స్వతంత్రులు 3 వార్డుల్లో గెలిచారు. ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు ప్రజలంతా గట్టి షాక్ ఇచ్చారు. నిత్యం యూట్యూబ్‌లలో ఇంటర్వ్యూలు తప్పా అభివృద్ధి చేయడం లేదంటూ ప్రజలంతా విరుచుకు పడుతుండగా పురపాలక ఫలితాలతో గుణపాఠం చెప్పారని జనాలంతా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.