దోమకొండ, డిసెంబర్ 13 : వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే ఇందుకు నిదర్శనం. ప్రజలకు అన్ని రకాల ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పునరంకితమవుతున్నది. కార్పొరేట్ వైద్యశాలల్లో ఉన్న మాదిరిగా వైద్యసేవలు, యంత్రాలు, సౌకర్యాలు సమకూర్చుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ముందడుగు వేసి గ్రామీణ ప్రజలకు పల్లెవైద్యం చేరువచేసేలా దృష్టిసారించారు. సబ్‌సెంటర్ల స్థానంలో కొత్తగా పల్లెదవాఖానలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో స్థల సేకరణ పూర్తయి భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొద్దిరోజుల్లోనే వైద్యసేవలు ప్రజలకు అందేలా ఏర్పాట్లు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
జిల్లాకు 82 పల్లె దవాఖానలు మంజూరు
కామారెడ్డి జిల్లాకు కొత్తగా 82 పల్లెదవాఖానలు మంజూరయ్యాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 60 శాతం మేర పనులు పూర్తవ్వగా మిగతా భవనాలు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో భవనానికి రూ.20లక్షలు కేటాయించి అన్ని రకాల సౌకర్యాలు, హంగులతో నిర్మిస్తున్నది. పల్లెదవాఖానలు మినీ కార్పొరేట్ దవాఖానలను తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
దవాఖానకో ఎంబీబీఎస్ వైద్యుడు
కొత్తగా ఏర్పాటు చేస్తున్న పల్లెదవాఖానల్లో వీలైనంతవరకు ఎంబీబీఎస్, బీఎంఎస్ వైద్యులను నియమించే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఎంబీబీఎస్ వైద్యులు సాధ్యం కాని పక్షంలో బీఎస్సీ నర్సింగ్ 2016నుంచి 2022 విద్యా సంవత్సరంలో పూర్తి చేసుకున్న వారిని నియమించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. పల్లెప్రజలకు సాధ్యమైనంత వరకు ఈ దవాఖానల్లోనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధులు నయంకాని పక్షంలోనే జిల్లా దవాఖానలకు మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయాలని సంకల్పిస్తున్నారు.
రెండు నెలల శిక్షణలో సిబ్బంది
పల్లెదవాఖానల్లో నియమించే సిబ్బందికి 2నెలల పాటు శిక్షణ అందిస్తున్నారు. ఎంబీబీఎస్, బీఎంఎస్, బీఎస్సీ నర్సింగ్‌తోపాటు ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. అక్కడ అందించే వైద్య సేవలు, అందుబాటులో ఉండే యంత్రాలు, రికార్డులు తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. పల్లెదవాఖానలకు వచ్చే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి, స్నేహపూర్వకంగా ఎలా మెలగాలి. సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ద్వారా వారికి అపోహ ఉన్న రోగాలను ఎలా తగ్గించాలి. దీర్ఘకాలిక రోగాలకు అందించాల్సిన సేవలు, వైద్యపరీక్షలు ఇతర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
మెరుగైన వైద్యం అందించేందుకు…
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానలను శ్రీకారం చుట్టింది. పల్లెల్లోని ప్రతి ఇంటికి వైద్యసేవలు అందుతాయి. ప్రత్యేకంగా నియమించిన సిబ్బందికి రెండునెలల పాటు శిక్షణ అందిస్తున్నాం. భవనాలు పూర్తయిన గ్రామాల్లో విడుతల వారీగా వైద్యసేవలను త్వరలోనే ప్రారంభిస్తాం.
-లక్ష్మణ్‌సింగ్, జిల్లా వైద్యాధికారి, కామారెడ్డి