ధర్పల్లి, జూలై 18 : ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఓ మహిళ తన గూడును గతేడాది నవంబర్‌లో కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం ముగ్గు సైతం పోసింది. తీరా లబ్ధిదారుల జాబితాలో పేరు రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె.. ఆరు నెలలుగా అధికారులు చు ట్టూ తిరుగుతున్నది. అయినా ఫలితం లేకపోయింది. మండలంలోని కోటా ల్‌పల్లి గ్రామంలో బానావత్ లక్ష్మి ఇల్లు గతేడాది కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో ఆమె పంచాయతీ అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకోగా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలు తన కూలిన గూడును పూర్తిగా తొలగించి, కొత్త ఇంటి నిర్మాణం కోసం ముగ్గు సైతం వేయించింది. తీరా ముగ్గు వేశాక ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు రాలేదం టూ చెప్పడంతో ఆవేదనకు గురైంది.
అప్పటి నుంచి అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ విడుత, మరో విడుత అంటూ అధికారులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఉండడానికి నీడ లేకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నది. ఉన్న గూడును కాస్త తొలగించడంతో తమకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని, పక్కనే రేకులు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నామని గోడు వెల్లబోసుకుంటున్నది. ఈ విషయమై గత సర్పంచ్‌ను వివరణ కోరగా, గ్రామంలో 92 మందితో కూడిన జాబితా పంపించగా, 27 మందికే మంజూరైనట్లు తెలిపారు. ఎంపీడీవో మారుతిని వివరణ కోరగా సదరు మహిళ పేరు లబ్ధిదారుల జాబితాలో లేదని సంబంధిత ఏఈని తెలుసుకుని త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత ఇల్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాకు ఇల్లు మంజూరైందని చెప్పి ముగ్గు పోయించారు. కానీ ఇప్పుడు ఆరేడు నెలలు గడిచినా నాకు ఇల్లు రాలేదు. నా భర్త బతుకుదెరువు నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. ఇక్కడున్న సార్లెవరూ పట్టించుకుంటలేరు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు. కలెక్టరమ్మకు దండం పెట్టి మొక్కుతున్న.. ఆమె కనికరించి నాకు ఇల్లు మంజూరుచేయించి ఆదుకోవాలని కోరుతున్న.
– బానావత్ లక్ష్మి, బాధితురాలు