మాక్లూర్/పొతంగల్, డిసెంబర్ 16: బీడీ కార్మికులకు రూ. 4వేల జీవనభృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాక్లూర్‌లో టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా..కొత్త పెన్షన్లు మంజూరుచేయాలని కోరుతూ పొతంగల్‌లో గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. మాక్లూర్‌లో టీయూసీఐ (ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) నాయకులు బీడీ కార్మికులతో కలిసి తహసీల్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ..బీడీ కార్మికులకు గతంలో నెలకు 26 రోజుల పని దొరికేదని, ప్రస్తుతం నెల కు 8 నుంచి 12 రోజులు పని మాత్రమే దొరుకుతున్నదని చెప్పారు. మోదీ ప్రభు త్వం బీడీ పరిశ్రమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికులకు రూ. నాలుగు వేల జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా, ఇంతవరకు అమలుచేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినిధులు రాజేశ్వర్, నాయకులు కిష న్, సాయిరెడ్డి, మురళి, గంగాధర్, సుజాత, లావణ్య, లక్ష్మీ, సరోజ, నందిని, రజిత, జమున, సుశీల పాల్గొన్నారు.
కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పొతంగల్ బస్టాండ్ వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధి బజరంగ్ హన్మాండ్లు మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నా మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. సూదం శంకర్, గంధం హన్మాండ్లు, రమేశ్, వెంకట్ రావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.