బీబీపేట : పెరుగుతున్న సైబర్ నేరాల ( Cyber Crimes ) పై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కామారెడ్డి పోలీసు ( Kamareddy Police ) కళాబృందం సభ్యులు కోరారు. బీబీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీం ( She Teams ) , సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు సోషల్ మీడియాలో ( Social Media ) ఫోటోలను పోస్ట్ చేయవద్దని, ఏదైనా ఆపద వస్తే 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. తెలియని నెంబర్‌తో ఫోన్ కాల్ వచ్చినా, గిఫ్ట్ వచ్చాయి, లోన్లు ఇస్తాం, బహుమతులు గెలిచారంటూ వచ్చే కాల్స్, లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. ఇతరులకు ఓటీపీలు షేర్ చేయవద్దని కోరారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని , హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఎల్ రామేశ్వర్ రెడ్డి, పోలీస్ కళాబృందం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.