కంఠేశ్వర్, సెప్టెంబర్ 19 : ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా ఓటరు జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం నుంచి పరిశీలకులుగా విచ్చేసిన డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి ఆయన గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ, ఇంటింటి సర్వే, పోలింగ్స్టేషన్ల నిర్వహణ, స్వీప్ కార్యకలాపాలు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 26తో గడువు ముగియనున్న దృష్ట్యా ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని, 100 శాతం సర్వే పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే సర్వే పూర్తిచేసిన బీఎల్వోలను అవసరం ఉన్నచోట సర్దుబాటు చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఓటరు జాబితా సవరణ, స్వీప్ కార్యకలాపాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాల గురించి వివరించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతి, కిరణ్మయి, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, రెవెన్యూ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.