Nizamabad | కంటేశ్వర్, జులై 19 : నకిలీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వాట్సాప్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన కీలక అంశాలతో కూడిన కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలోని వ్యాపారస్తులు, ప్రజలకు ఆయన ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా గత రెండు రోజుల నుండి కొందరు సైబర్ నేరగాళ్లు 9492219684 అనే మొబైల్ నంబర్ నుండి వాట్సాప్ ద్వారా సకిలీ సందేశాలను పంపుతున్నారని మున్సిపల్ అధికారుల పేరుతో ‘ట్రేడ్ లైసెన్స్ ఫీజు’ చెల్లించాలంటూ ఒక క్యూఆర్ కోడు కూడా ఆ మెసేజ్‌లలో పంపుతున్నారని పేర్కొన్నారు.
ఈ నంబర్ నుండి వచ్చే సందేశాలు పూర్తిగా నకిలీవని, ఇది ప్రజల సొమ్మును దోచుకునేందుకు సైబర్ ముఠాలు వేసిన పెద్ద వల అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేశారు. 9492219684 నంబర్ లేదా ఇతరత్రా ఎలాంటి తెలియని నంబర్ల నుండి వచ్చే QR కోడ్లను స్కాన్ చేసి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు లేదా ఇతర మున్సిపల్ పన్నుల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా.. నేరుగా నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిఅధికారులను వ్యక్తిగతంగామాత్రమే సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వ ఫీజులను కేవలం అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ లేదా మున్సిపల్ కౌంటర్లలో మాత్రమే చెల్లించాలని వాట్సాప్ లింకులద్వారాఎలాంటి లావాదేవీలు చేయకూడదని సూచించారు. ఈ తరహా మోసపూరిత సందేశాలు ఎవరికైనా వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాల బారిన పడొద్దని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు.