కంఠేశ్వర్/ ఖలీల్వాడి, డిసెంబర్ 5 : రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నిజామాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుంచి అభ్యర్థనలను గురువారం స్వీకరించింది. ఆయా కులసంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వర్రావు, కార్యదర్శి సైదులు రాతపూర్వకంగా విజ్ఞాపనలను స్వీకరించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నివేదిక సమర్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల్లో స్థానంలేని కులాలకు రిజర్వేషన్ కల్పించాలని, కులవృత్తులపై ఆధారపడిన తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఎక్కువ మంది వినతిపత్రాలు అందించారని వివరించారు. కులాలను ఏ,బీ,సీ,డీగా వర్గీకరిస్తే ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ముస్లిం కమ్యునిటీ తరఫున జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ నవీద్ ఇక్బాల్ కమిషన్ చైర్మన్కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 12.7 శాతం ఉన్నదని, జనాభా ప్రకారం లోకల్బాడీస్ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్లు మొత్తం కలిపి 1000 స్థానాలు ఉంటే, ముస్లింలకు 72 సీట్లు మాత్రమే (7.2 శాతం) ఉన్నాయని విన్నవించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, కామారెడ్డి జడ్పీ సీఈవో చందర్రాథోడ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారిణి స్రవంతి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారులు స్రవంతి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.