కుల గణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపి మోసానికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన ఒక బూటకమని, సర్వే నివేదిక తప్పుల తడక అని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించి బలహీన వర్గాల గొంతుకోసిందని, 42శాతం రిజర్వేషన్ల వాగ్దానాన్ని తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. బీసీ జనాభాను తగ్గించి చూపెట్టి, బలహీనవర్గాలను చిన్నచూపు చూస్తున్నారని, శాస్త్రీయంగా రీ సర్వే చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
-నిజామాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన తప్పుల తడక అని తేలిపోయింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమమే ఇప్పుడు గుదిబండగా మారింది. సర్వేలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించింది. మండల్ కమిషన్ అంచనాల ప్రకారం దేశంలో బీసీల జనాభా 52శాతం. ఈ లెక్కన ఏ రాష్ట్రంలో చూసినా బీసీల జనాభా దాదాపుగా 50శాతం కన్నా ఎక్కువే తప్ప, తక్కువ మాత్రం కాదు. కానీ కాంగ్రె స్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణ న సర్వేలో మాత్రం బీసీల జనాభా 46శాతమని పేర్కొంది. ఈ వివరాలు వాస్తవ లెక్కలకు బహుదూరంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51శాతంగా తేలింది. పదేండ్లలో బలహీన వర్గాల జనాభా కోటీ 85లక్షల నుంచి కోటీ 64లక్షలకు తగ్గింది.
రాష్ట్ర జనాభా పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో బీసీల జనాభా పెరగాలి. కానీ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మాత్రం అందుకు విరుద్ధంగా మారింది. రాష్ట్రంలోని బలహీన వర్గాలను రేవంత్ రెడ్డి సర్కారు నమ్మించి మోసం చేసింది. సర్వే పూర్తి అసంబద్ధంగా, శాస్త్రీయత లేకుం డా చేశారు. బీసీ కుల గణన లెక్కలను బహిర్గతం చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు బీసీలకు అనేక హామీలిచ్చి, అమలు సమయంలో నోటికాడి బువ్వను లాక్కునే పద్ధతిలో అసంబద్ధ విధానాలకు తెగబడడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.
పదిహేను నెలల రేవంత్ రెడ్డి పాలనలో రా ష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించడంతో హైడ్రా పేరుతో కూల్చివేతలు, కబ్జాలు, రైతులు, సామాన్యుల ఆక్రందనలతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. మేమెంతో మాకంత వాటా ఇదీ బీసీల చిరకాల స్వప్నం. అయితే కాంగ్రెస్ సర్కారు తాజాగా ప్రవేశ పెట్టిన కుల గణన లెక్కలు బీసీల ఆశలను చిదిమేశాయి. రాష్ట్రం లో బీసీల జనాభా 46.25శాతమేనని, ముస్లిం బీసీలు 10.08శాతంతో కలుపుకుంటే బీసీల మొత్తం జనాభా 56.33శాతం కూడా దాటడం లేదని ప్రభుత్వం చెబుతున్నది.
కుల గణన పేరిట బీసీలను తక్కువ చేసి చూపించిన ఈ నివేదికపై బీఆర్ఎస్ సహా బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. వెనుకబడిన వర్గాలను నమ్మించి గొంతు కోయడమేమిటని నిలదీస్తున్నాయి. ఈ లెక్కలపై సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మొదలు సీనియర్ నేతలు కూడా భిన్న స్వరాలు వినిపించారు. ముప్పేట దాడి పెరిగిన నేపథ్యం లో అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు సాధ్యమయ్యేనా? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ తన అసలు బుద్ధిని బయట పెట్టుకున్నది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని… ఒప్పుకుంటేనే అమలు చేస్తామని యూటర్న్ తీసుకున్నది. లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామనంటూ చేతులు దలుపుకున్నది.
కాంగ్రెస్ ప్రకటనపై బహుజనలు ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బీసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు రాబట్టుకునేందుకు తెరమీదికి తెచ్చిన బీసీ కులగణన అంశం బెడిసి కొట్టింది. కాంగ్రెస్ ప్రభు త్వం విడుదల చేసిన కుల గణన సర్వేపై సామాజిక వేత్తలు, బీసీ సంఘాలు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 46.25 శాతం మాత్రమే ఉన్నదంటూ నివేదిక వెల్లడించడాన్ని తప్పుబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సర్వే మొత్తం తప్పుల తడకగా కొనసాగిందని మండిపడుతున్నారు.
2023లో బిహార్లో చేపట్టిన కుల గణన సర్వేలో బీసీల వాటా ఆ రాష్ట్ర జనాభాలో ఏకంగా 63.14 శాతంగా ఉన్నదని గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కులగణనలో ఎన్యుమరేటర్లు అరకొర సమాచారాన్నే సేకరించారని, శాస్త్రీయత లేకుండా నిర్వహించిన ఈ సర్వేతో తెలంగాణలోని బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
చట్టసభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి దగా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకుండా బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతున్నది. ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా కాంగ్రెస్ ప్రకటించుకున్నది. వాస్తవానికి ఇన్ జస్టిస్ డేగా బీసీలు జరుపుకొనే దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ తొలినుంచి బీసీల వ్యతిరేకి. కులగణన నివేదిక ఓ బోగస్. అశాస్త్రీయంగా చేసిన బిహార్ కులగణనను పాట్నా హైకోర్టు కొట్టి వేసింది. బీసీ కమిషన్ ద్వారా కాకుండా ప్లానింగ్ శాఖ ద్వారా చేస్తేనే అక్కడి కోర్టు కొట్టేసింది. తెలంగాణలో అలాంటి పొరపాటే చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదు. అందుకే తూతూ మంత్రంగా కుల గణన చేపట్టి చేతులు దులుపుకొన్నారు. బీసీలను నిలువునా కాంగ్రెస్ ముంచేసింది. జనాభా పరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అందకుండా చేస్తున్నది.
– బాజిరెడ్డి గోవర్ధన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఎన్నికల ముందు కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కానిప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పార్టీ పరంగా 42శాతం సీట్లిస్తామని చెప్పడం నయా మోసానికి నిదర్శనం. బీసీ రిజర్వేషన్లు అనేవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాదు. చట్టబద్ధత కూడిన రిజర్వేషన్లను అమలు చేస్తే అన్నింట్లో బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తప్పును సరిదిద్దుకునేందుకు వంద తప్పులు చేస్తున్నది. అడుగడుగనా అమాయక ప్రజలను మోసగిస్తున్నది.దీనిని ప్రజంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో హస్తం పార్టీకి గుణపాఠం చెబుతారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు.
– గంప గోవర్ధన్, మాజీ ప్రభుత్వ విప్
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి దగా చేశారు. చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా 42శాతం సీట్లు ఇస్తామనడం మోసపూరితమైంది. ఎన్నికల ముందు బీసీల రిజర్వేషన్లను 42శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారాల్లో నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఇప్పుడు మాట తప్పి, తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా తప్పించుకోవాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతున్నది. దేశ వ్యాప్తంగా బీసీల జనాభా పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం ఎందుకు తగ్గింది. కుల గణన ద్వారా బీసీల జనాభాను ఈ ప్రభుత్వం తగ్గించి చూపించింది. ఓటర్ల సంఖ్యకు, తెలంగాణ జనాభా లెక్కలకు, కుల గణన సర్వేకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. కులగణన అంటే రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో వెల్లడించాలి. కానీ కులాల వారీగా జనాభాను మాత్రం సక్రమంగా వెల్లడించకుండా ప్రభుత్వం భారీ కుట్రకు తెర లేపింది.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే