డిచ్పల్లి, అక్టోబర్ 27 : రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ వ్యవస్థను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్లలో పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబీకులు నిరసనలు చేపడుతున్నారు. దీంతో 39 మంది స్పెషల్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి మండలకేంద్రంలోని ఏడో బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
అంతకుముందు కమాండెంట్ సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఉద్యోగాలను సైతం వదులుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం తమ కుటుంబీకులు నిరసనలు చేస్తే, సమస్యలు పరిష్కరించకుండా సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. సివిల్ పోలీసులకు ఇతర విధులు ఇవ్వడం సరికాదని, తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు.