తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబురాలు ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటాయి. ఎనిమిదిరోజులపాటు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడిపాడిన మహిళలు గురువారం సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
ఊరూవాడా పూలవనాలను తలపించాయి. ఆడపడుచులు గౌరీ దేవీని కీర్తిస్తూ పాటలు పాడారు. మహిళలందరూ ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడారు. సకల సౌభాగ్యాలు అందించుమా… మళ్లీ వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. పసుపు, బొట్లు, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం వెంట తెచ్చుకున్న సద్దులను ఆరగించారు.