హనుమకొండ, సెప్టెంబర్ 28 : హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయం పూల వనాన్ని తలపించింది. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు రంగురంగుల పూలతో బతుకమ్మలతో మహిళలు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు అద్దంపట్టేలా బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పాటలతోపాటు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై ఆడి పాడారు. బతుకమ్మ ఆడిన ఆడబిడ్డలకు భోజనాలు పెట్టి, కానుకగా చీరెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో గతంలోని చీకటి రోజులు వస్తున్నాయన్నారు. ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడతున్నారన్నారు. తెలంగాణ పండుగలు తెలియని దుస్థితి కాంగ్రెస్‌దని ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులు స్వ చ్ఛందంగా బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పండుగలు, ప్రజల విశ్వాసాలకు విలువ ఇవ్వడం లేదన్నారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర మహిళా నేతలు సుశీలారెడ్డి, సుమిత్రా ఆనంద్, రేణుక, పావనీగౌడ్, రజితారెడ్డి, మహిళా నేతలు పెద్ది స్వప్న, ఎల్లావుల లలితాయాదవ్, డాక్టర్ హరి రమాదేవి, దాస్యం వినయ్‌భాసర్ సతీమణి రేవతీభాసర్, దాస్యం విజయ్ భాసర్ సతీమణి శిరీష, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ రిజ్వానామసూద్, కార్పొరేటర్ నల్ల స్వరూపారాణి, ఇమ్మడి లోహితా రాజు, నాయకులు మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కమురున్నీసాబేగం, నయీమొద్దీన్, బొద్దు వెంకన్న, పోలపల్లి రామ్మూర్తి, వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం డివిజన్ అధ్యక్షురాళ్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, హనుమకొండ జిల్లా ముఖ్య నాయకులు, పశ్చిమ గులాబీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలో అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని మరవని నేత కేసీఆర్. అన్ని వర్గాల ప్రజలు జరుపుకొనే పండుగలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు ఆత్మ గౌరవ భవనాలు, వారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు.
– మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
కాంగ్రెస్ సరారు అన్ని వర్గాలను మోసం చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మ పండగ నిర్వహణలోనూ కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యా ప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన హనుమకొండ జిల్లాలో బతుక మ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆత్మగౌరవంతో పాల్గొనాల్సిన పండుగలో అసౌకర్యానికి గురవుతున్నారు. కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగకు చీరెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొచ్చి కంటి తుడుపుగా కానుకలు ఇస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో రైతులు యూరియా దొరకక అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి.
– మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
బతుకునిచ్చే బతుకమ్మ పండుగ పట్టని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలను మోసం చేసింది. మహిళలకు ఇస్తామన్న రూ. 2500, తుల బంగారం, విద్యార్థినులకు సూటీలు, సాలర్ షిప్‌లు, కోటీశ్వర్లు చేస్తామన్న హామీలన్ని కాంగ్రెస్ మరిచింది. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌ను మరిచి నిరుద్యోగులను ఈ కాంగ్రెస్ మోసం చేసింది. ప్రజాపాలన అన్న కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నది. కరీంనగర్ మాజీ జడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగిస్తున్నది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు, ఎగవేతలు, కోతలే తప్ప సంక్షేమం, అభివృద్ధి కనబడడం లేదు.
– మాజీ విప్ గొంగడి సునీత