నిజామాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అడ్డదారిలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు యత్నించిన నాయకులకు ఎదురుదెబ్బ తగిలింది. భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ సొసైటీ విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు పాకులాడి హైకోర్టు ముందు బొక్కా బోర్లపడాల్సిన పరిస్థితి ఎదురైంది. కోర్టు వెలువరించిన తీర్పు ..కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టులా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి కుటిల రాజకీయాలకు తెరలేపింది.ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి చెందిన నాయకులు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. పార్టీలో చేరికల నుంచి సహకార సంఘాల్లోనూ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు. ఇందుకు భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ సొసైటీ అంశమే ఉదాహరణగా నిలుస్తున్నది.
దొడ్డిదారిన విభజన ఉత్తర్వులు
బస్వాపూర్ సొసైటీ విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు పావులు కదిపారు. సొసైటీ చైర్మన్‌పై పాలకవర్గ సభ్యులందరూ ఈ ఏడాది ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకున్నారు. ఫలితాలను వెల్లడించేలోపే సహకార శాఖకు చెందిన అధికారులను ప్రభావితం చేసి బస్వాపూర్ సొసైటీని రెండు ముక్కలు చేస్తున్నట్లు దొడ్డి దారిలో విభజన ఉత్తర్వులు తీసుకువచ్చారు. దీంతో పాత బస్వాపూర్ సొసైటీ పాలకవర్గం సాంకేతికంగా సుప్తావస్థలోకి వెళ్లింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ కాకుండా బస్వాపూర్, కాచాపూర్ సొసైటీల మనుగడ అసాధ్యమని సహకార చట్టంలోని పలు సెక్షన్లు స్పష్టంగా చెబుతున్నా.. తమ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ కీలక నేత కుటిల రాజకీయాలకు పాల్పడ్డాడు. రెండుగా ఏర్పడిన బస్వాపూర్, కాచాపూర్ సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించేలా ప్రభుత్వం నుంచి మరో ఉత్తర్వును జారీ చేయించారు. పాలకవర్గం చేత అవిశ్వాసంలో పదవిని కోల్పోయిన వ్యక్తిని పర్సన్ ఇన్‌చార్జీగా నియమించి కాంగ్రెస్ నేతలు తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
కాంగ్రెస్ నేతలకు షాక్
రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక.. కుట్రలతో పెత్తనం చెలాయించేందుకు కాంగ్రెస్ ముఖ్యనాయకుడొకరు వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టింది. పర్సన్ ఇన్చార్జీల నియామకాన్ని సవాల్ చేస్తూ బస్వాపూర్ పాలకవర్గ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా సుదీర్ఘ వాదనల తర్వాత న్యాయమూర్తి స్పష్టమైన తీర్పును వెలువరించారు. ఈ తీర్పుతో కాంగ్రెస్ నేతలకు గట్టి షాక్ తగిలినట్లయ్యింది. పర్సన్ ఇన్చార్జీల నియామకం రద్దు, బస్వాపూర్ సొసైటీ విభజన చెల్లదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా సొసైటీ విభజనను గుర్తించలేమంటూ చెప్పడంతో, తిరిగి పాత బస్వాపూర్ విండో పాలకవర్గానికి సర్వ అధికారాలు సమకూరనున్నాయి. చైర్మన్ పదవిని కోల్పోయిన వ్యక్తి స్థానంలో మరో సభ్యుడికి చైర్మన్‌గా అవకాశం దక్కనున్నది. సొసైటీ విషయంలో అతి జోక్యం చేసుకుని న్యాయబద్ధమైన ప్రక్రియలో బీఆర్ఎస్ నేతల ముందు కాంగ్రెస్ వృద్ధ నేత ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అధికార దుర్వినియోగం
బస్వాపూర్ సొసైటీ పాలకవర్గ విషయంలో సహకార శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలకు వంతపాడుతూ, వారి చెప్పిన ప్రతి అంశాన్నీ ఉత్తర్వు రూపంలో అమలుచేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ నేతల కు వంత పాడారు. రాత్రికి రాత్రే ఉత్తర్వులను తయారు చేయ డం, వాటిని క్షణాల్లో అమలు చేశారని పాలకవర్గసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ వాదన వినకుండా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పు.. బస్వాపూర్ సొసైటీకి ఊపిరి పోయగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టులాంటిదని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు.
హైకోర్టు ఆదేశాలను అమలుచేయాలి
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలుచేయాలని కోరుతూ బస్వాపూర్ సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ మద్దిస్వామి, మాజీ పాలక వర్గ సభ్యులు.. డీసీవో రామ్మోహన్‌ను కోరారు. ఈ మేరకు వారు కోర్టు వెలువరించిన ఉత్తర్వుల కాపీని శుక్రవారం ఆయనకు అందజేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశానుసారం పాత పాలకవర్గాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. పాలకవర్గ మాజీ డైరెక్టర్లు పాతూరి రాజు,సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి, నర్సింహులు, కిష్టారెడ్డి ఉన్నారు.