మోర్తాడ్, నవంబర్ 5: నిజామాబాద్ వాసికి లివర్ క్యాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపోజిట్లపై థాయ్‌లాండ్‌తో పాటు భారతదేశంలో పేటెంట్ హక్కులు లభించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో గడిచిన వందేండ్లలో ఎవరికీ పేటెంట్ హక్కులు రాలేదు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామానికి చెందిన బాస అశోక్ ఈ ఘనత సాధించిన తొలివ్యక్తిగా గుర్తింపుపొందడం విశేషం. గతంలోనే థాయిలాండ్ దేశంలో పేటెంట్ హక్కులు పొందిన అశోక్.. తాజాగా భారతదేశంలో పేటెంట్హక్కులు పొందడంతో ఉస్మానియా వర్సిటీలో వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు ఆయనను మంగళవారం సాయంత్రం సన్మానించారు.
యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్‌కు నూతన పరిశోధనలు అంటే అమితాసక్తి. ఓయూలోనే ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేసి అక్కడే పీహెచ్డీ చేశారు. ప్రిపరేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ సమ్ పాలిమర్ గ్రీన్ కాంపోసైట్స్ యూజింగ్ బయోఫీలర్స్ అనే అంశంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. దేశంలో కాలేయ క్యాన్సర్ ఎక్కువగా ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యంలో దాని నివారణ కోసం అశోక్ నానోకాంపోజిట్ టర్మరిక్పౌడర్ విత్ ఇన్ ఎస్ఐటీయూ జనరేటెడ్ మెటల్ నానోపార్టికల్స్ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం లేబరేటరీ సెల్ లైన్స్టడీస్ ఇండికేటెడ్ ఇట్స్ ఎఫిసైన్సీ ఇన్ ఇంచిబీటింగ్ అండ్ అపోపీతోసిస్ ఆఫ్ హేపీజీ 2 క్యాన్సర్ సెల్స్ అని, లివర్ క్యాన్సర్ నివారించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అశోక్ తెలిపారు. ఇదే అంశంలో భారత్, థాయ్‌లాండ్ దేశాల్లో పేటెంట్ హక్కులు పొందినట్లు చెప్పారు. రెండు దేశాల్లో పేటెంట్ హక్కులు పొందిన అశోక్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.