రుద్రూర్, అక్టోబర్ 10: ‘రాజకీయంగా నాకు చాలా అనుభవం ఉంది. ఎవరిని ఏడ పెట్టాలో నాకు బాగా తెలుసని’ బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొందరు దుర్మార్గులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దయ వల్ల బాన్సువాడలో పేదలకు ఇండ్లు వచ్చాయన్నారు. వర్నిలో గురువారం నిర్వహించిన స్థానిక ఏఎంసీ పాలకవర్గ ప్రమాణస్వీకారంలో పోచారం మాట్లాడారు.
కాంగ్రెస్‌లోకి తాము వస్తుంటే కొందరు స్వాగతించారని, మరికొందరు దుర్మార్గులు అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. అనవసరంగా రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో తనకు తెలుసన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డిని బాన్సువాడలో అడుగు పెట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పినా వినకుండా కొంత మందిని రెచ్చగొట్టి, అభివృద్ధి పనులకు ఆటం కం కలిగిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ దయ వల్ల పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందాయని, ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నదని, నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని చెప్పారు.
అర్హుల జాబితా తయారు చేయాలని అధికారులకు సూచించారు. త్వరలోనే రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. గతంలో మార్కెట్ కమిటీలో అవకతవకలు జరిగాయని, నూతన కార్యవర్గం ఎలాంటి అక్రమాలకూ చోటివ్వకుండా అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. రుణమాఫీ కాని రైతుల కోసం త్వరలోనే రూ.13 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ఎంపీ సురేశ్ షెట్కార్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నేతలు పోచారం భాస్కర్‌రెడ్డి, కూనీపూర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.