బాన్సువాడ/కోటగిరి, అక్టోబర్ 22: ఆరుగాలం శ్రమిం చి పండించిన ధాన్యాన్ని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, వారి జీవితాలతో చెలగాటమాడితే సహించేదిలేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ, బీర్కూర్ మండల కేంద్రంలో సొసైటీలు, వర్నిలో ఏంఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా సొసైటీల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ మాట్లాడారు. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో వరిని ఎక్కువగా పండించే నియోజక వర్గం బాన్సువాడ అని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ , బీర్కూర్, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, కోటగిరి, రుద్రూర్, మోస్రా మండలాల్లో కలిపి సుమారు లక్షా వెయ్యి ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉందన్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం 90 వేల 40 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, తన అంచనా ప్రకారం 30 వేల మెట్రిక్ టన్నుల పైబడి ఉత్పత్తి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అధికారులు పరిశీలించాలని సూచించారు.
కామారెడ్డి జిల్లాలో 349 కొనుగోలు కేంద్రాలు
ప్రభుత్వం రాష్ట్రంలో ఏడు వేల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నదని ఇందులో కామారెడ్డి జిల్లాలో 349 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడక్కడ ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని, వాటిని బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో మాట్లాడి పంపించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌ను ఆదేశించారు. యాసంగిలో సాగుకు సరిపడా నీరు ఉందని, ఇష్టం వచ్చిన పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు. రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకే విక్రయించుకోవాలని సూచించారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమఅవుతాయని చెప్పారు. రాష్ట్రంలోనే బాన్సువాడలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్‌కు సొసైటీ పాలక వర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూం నంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచించారు.
రైతు నాగలి కిందపెడితే దేశం ఆగమవుతది
దేశంలో రైతులు భుజం మీది నాగలి కిందపెడితే యావత్ దేశం ఆగమవుతదని సభాపతి పోచారం అన్నారు. రైతులను చిన్న చూపు చూసే ప్రభుత్వాలు ముందుకు సాగవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాష్ట్ర విత్తనోత్పత్తి సంస్థ చైర్మన్ డాక్టర్ కేశవ్, డీఎస్వో పద్మ, డీసీవో వసంత, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు పరిగె మంజుల, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వర్నిలో జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, కో -ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ చైర్మన్ మూడ్ కవితా అంబర్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్లు నామాల సాయిబాబ, కృష్ణారెడ్డి, అప్పిరెడ్డి పాల్గొన్నారు.
పట్టణలోని పాత బాన్సువాడ చావిడి వద్ద డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించకున్న లబ్ధిదారులకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి శనివారం బిల్లులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రాష్టంలో ఎక్కడాలేని విధంగా బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. ఆయనకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కుల, మత, పార్టీ, వర్గ భేదం లేకుండా అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలో సుమారు 2,300 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో కాంట్రాక్టర్ ద్వారా వెయ్యి ఇండ్లు నిర్మిస్తుండగా.. సొంతంగా నిర్మించుకుంటున్న ఇండ్లు 1300 ఉన్నాయని వివరించారు. అదనపు కలెక్టర్ చంద్రమౌళి, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ కె. జగన్నాథరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.