స్వయం సహాయక సంఘాల మహిళలకు గ్రామీణ బ్యాంకింగ్ సేవలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. వివిధ రూపాల్లో ఖాతాల్లో జమ అయిన నిధులను ప్రజలు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ల ద్వారా డ్రా చేసుకోవడంతో వాటిని నిర్వహించే మహిళలకు కమీషన్ వస్తున్నది. దీంతో మహిళలు సొంత గ్రామంలోనే ఉంటూ నెలకు సగటున రూ.20వేల వరకు సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్లు విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్(వీఎల్ఈ)లకు మంచి ఆదాయాన్ని సమకూర్చడం విశేషం.
-కోటగిరి, మే 16
మహిళా స్వయం సహాయక సంఘాల్లోని ఇంటర్ చదివిన సభ్యులు వీఎల్‌ఈలుగా రాణిస్తున్నారు. విద్యావంతులైన కొందరు విభిన్నమైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. తమ వృత్తులు, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూనే ఇంటి వద్ద మినీ బ్యాంకులు(వినియోగదారుల సేవా కేంద్రాలు) నిర్వహిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మారుమూల పల్లెల్లోని ప్రజలకు బ్యాంకుల సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
బ్యాంకుల ప్రోత్సాహంతో..
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటున్న మహిళల్లో ఇంటర్, డిగ్రీ చదివిన వారిని విలేజ్ లెవల్ ఎంటర్ ప్రెన్యూర్(వీఎల్ఈ)లుగా ఎంపిక చేస్తున్నారు. వారికి వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా బ్యాంకు సేవలను ఎలా అందించాలో శిక్షణ ఇస్తున్నారు. డబ్బులు డిపాజిట్, విత్‌డ్రా, పాస్బుక్ల ప్రింట్, స్త్రీనిధి లేదా బ్యాంకు లింకేజీ రుణాల కిస్తుల చెల్లింపు, ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాలోకి నగదు బదిలీ, ఆసరా పింఛన్లు, రైతుబంధు డబ్బుల పంపిణీ వంటి లావాదేవీలు సేవా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రాలు నిర్వహిస్తున్న మహిళలకు కమీషన్ వస్తుంది. ఎక్కువ లావాదేవీలు జరిగే చోట ఒక్కో వీఎల్ఈ నెలకు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు కమీషన్ రూపంలో ఆదాయం ఆర్జిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ బ్యాంకులకు అనుబంధంగా వందల సంఖ్యలో వినియోగదారుల సేవా కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 30శాతం కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే స్త్రీనిధి, ఎస్బీఐ సహకారంతో 110 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 120కేంద్రాలు, మిగతా బ్యాంకులకు అనుబంధంగా వందకు పైగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఇంటి దగ్గరే నిర్వహిస్తున్న..
మాది కల్లూర్. రాధిక స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరాను. 2015లో యూనియన్ బ్యాంకుతో అనుసంధానం ఉన్న ఫినో పేమెంట్ బ్యాంకు సేవా కేంద్రాన్ని ఇంటి వద్ద ఏర్పాటు చేశాను. గ్రామంలోని రైతులు, మహిళలు, ఇతర వినియోగదారులు సేవా కేంద్రానికి వచ్చిడబ్బులు విత్ డ్రా, డిపాజిట్ చేస్తున్నారు. నెలకు రూ.20లక్షలకు పైగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. ఎక్కువ లావాదేవీలు జరిగిన నెలలో ఎక్కువ కమీషన్ వస్తుంది.
– గంగామణి, వీఎల్ఈ, కల్లూర్, పొతంగల్
రూ.15 వేల వరకు సంపాదిస్తున్నా..
నేను కోటగిరిలోని నజీర్బీ శిల్పా మహిళా పొదుపు స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. 2016 సంవత్సరంలో నన్ను వీఎల్ఈగా ఎంపిక చేసి డీఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఏపీజీవీబీ సహకారంతో వినియోగదారుల సేవా కేంద్రం నిర్వహిస్తున్నాను. రోజూ రూ. 25వేల వరకు విత్‌డ్రాలు, డిపాజిట్లు, నెలకు సగటున రూ.8లక్షల లావాదేవీలు జరుగుతాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు డబ్బులు పంపిణీ చేస్తాను. ప్రతి నెలా రూ. 20-25వేల వరకు కమీషన్ వస్తున్నది. వ్యాలెట్ల వినియోగం పెరిగాక సేవా కేంద్రాల్లో లావాదేవీలు కొంత తగ్గాయి. లేదంటే మరింత ఎక్కువ ఆదాయం వచ్చేది.
– దేవినేని సాయిసుధ, వీఎల్ఈ, కోటగిరి
ఉపాధి లభిస్తుంది..
మాది పొతంగల్ మండలం కల్లూర్ గ్రామం. శివసాయి మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలిని. గత నెలలో నాకు బీసీ పాయింట్ ఇచ్చారు. కెనరా బ్యాంకు అనుసంధానంతో మినీ బ్యాంకు ద్వారా గత నెల సుమారు రూ.25లక్షలకుపైగా లావాదేవీలు చేశాను. రూ.8 వేలు కమీషన్ రూపంలో వచ్చింది. ప్రభుత్వ ఆలోచనతో ఉపాధి లభించింది. ఇంటి వద్ద నుంచే రైతులు, ఇతరాత్ర వారికి ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు సహాయంతో డబ్బులు ఇస్తూ, ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నా. కూర్చున్న చోటే నెలకు రూ.8వేల ఆదాయం వస్తుంది.
– ఎస్.సంధ్య, కల్లూర్, పొతంగల్