లింగంపేట, మే 5: సంతలో సరుకులా ఓ బాలుడిని విక్రయించిన ఘటనలో తల్లి సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకా రం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు ఐదేండ్ల క్రితం నర్సింహులుతో వివాహం కాగా ఒక బాబు, పాప జన్మించారు. కొంతకాలం క్రితం నర్సింహులు మృతి చెందగా లావణ్య ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు పర్మళ్ల గ్రామానికి చెందిన కూలిపని చేసుకుంటున్న చాకలి సాయిలుతో పరిచయం ఏర్పడింది.
భార్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోవడతో సాయిలు ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో సాయిలు బూస లావణ్య సహజీవనం చేస్తున్నారు. మనం ఆటో నడపుకుంటూ జీవిద్దామని, ఆటో కొనుగోలు కోసం బాలుడిని విక్రయిద్దామని లావణ్యను ఒప్పించాడు. లావణ్య తన వద్ద కూతురు ఉంచుకొని, కుమారుడు నిఖిల్(5)ను పర్మళ్ల గ్రామానికి చెందిన నసీమాకు రూ.50వేలకు విక్రయించారు. సదరు బాలుడిని నసీమా.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటలో ఉన్న సోదరి షాహిదాకు రూ.50 వేలకు విక్రయించింది. షాహిదా సైతం ఆ బాలుడిని కుంచాల శేఖర్‌కు లక్ష రూపాయలకు విక్రయించింది.
సాయిలు మొదటి భార్య తిరిగి ఇంటికి రావడంతో లావణ్యను బయటికి పంపించివేశాడు. బాలుడిని విక్రయించిన విషయం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు తెలియడంతో వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. బాలుడిని స్వాధీనం చేసుకుని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. బాలుడి తల్లి బూస లావణ్య, చాకలి సాయిలు, నసీమా, షాహీదా, కుంచాల శేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.