ఎల్లారెడ్డి రూరల్, మే 19: ప్రస్తుత సమాజంలో మనిషి బిజీ బిజీగా మారాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దు పోయే వరకూ తీరక లేకుండా గడుపుతున్నాడు. ఆరోగ్య విషయంలో అసలు శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనారోగ్యం పాలై దవాఖానల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఒత్తిడి కూడా మరింత పెరుగుతున్నది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునేలా చేయడంతో పాటు క్రమం తప్పకుండా యోగా చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు 16 ఆరోగ్య స్వస్థత(యోగా) కేంద్రాలు మంజూరు చేసింది. ప్రభుత్వ దవాఖానలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు అనుబంధంగా వీటిని నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ యోగాసనాలతోపాటు ఆరోగ్య సూత్రాలను కూడా వివరించనున్నారు. సాధారణ వ్యక్తులతో పాటు గర్భిణులకు అవసరమైన ఆసనాలు నేర్పిస్తారు. విడుతల వారీగా మరిన్ని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
కేంద్రానికి ఇద్దరు శిక్షకులు..
ఆరోగ్య స్వస్థత కేంద్రాల్లో ప్రభుత్వం ఇద్దరు శిక్షకులను నియమించనున్నది. యోగా కోర్సుల్లో ధ్రువపత్రాలు కలిగిన స్త్రీ, పురుషుడిని ఎంపిక చేస్తారు. వీరికి నెలకు రూ.ఆరు వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు సమాచారం. ఆరోగ్య భారత్లో భాగంగా ప్రతి పౌరుడూ యోగాసనాలు నేర్చుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు మంజూరైన 16 కేంద్రాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే వీటిని ప్రారంభించి యోగాసనాలు నేర్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రూ.6లక్షలతో ఒక్కో కేంద్రం నిర్మాణం..
ఒక్కో కేంద్రం నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించే డిస్పెన్సరీలు ఉన్న ప్రదేశాల్లో ఆరోగ్య స్వస్థత కేంద్రాలను నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎనిమిది అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవుతో వెలుతురు, గాలి సమృద్ధిగా వచ్చే విధంగా షెడ్లను నిర్మిస్తున్నారు. కేంద్రం ఆవరణలో ఔషధ మొక్కలను పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారు.
కామారెడ్డి జిల్లాకు మంజూరైన కేంద్రాలు ఇవే..
1) కామారెడ్డి 2) ఎల్లారెడ్డి 3) గాంధారి 4) పుల్కల్ (మం:బిచ్కుంద) 5) ఆర్గొండ (మం:రాజంపేట్) 6) చిల్లర్గి (మం:పిట్లం) 7) దోమకొండ 8) నాగిరెడ్డిపేట్ 9) లింగంపేట్ 10) జుక్కల్ 11) నిజాంసాగర్ 12) భిక్కనూరు 13) మద్నూర్ 14) బీబీపేట్ 15) ఎల్లంపేట్ (మం:మాచారెడ్డి) 16) బాన్సువాడ
కేంద్రాల నిర్మాణం పూర్తయ్యింది..
జిల్లాకు మంజూరైన 16 ఆరోగ్య స్వస్థత కేంద్రాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. వాటిలో ఇప్పటికే కొన్నింటిని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అప్పగించారు. మిగితా వాటిని కూడా త్వరలో అప్పగిస్తారు. ఆయుష్ విభాగం నుంచి వెలువడిన ఉత్తర్వుల మేరకు శిక్షకులను నియమించి యోగా తరగతులను ప్రారంభిస్తాం.
-సీహెచ్ వెంకటేశ్వర్లు, ఆయుష్ జిల్లా కో ఆర్డినేటర్