ఆర్మూర్, ఆగస్టు19 : కృషి, పట్టుదలతో అద్భుత విజయాలు సాధించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో చిట్ల ప్రమీల, జీవన్‌రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా మాదిరిగానే విద్యాస్ఫూర్తి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సెస్సీ లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన ట్రస్టు ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేశారు. బంగారు, వెండి పతకాలను బహూకరించి చిన్నారులకు ప్రోత్సాహకాలను అందజేశారు. నిజామా బాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్మూర్ ఆర్డీవో తిరుక్కోవెల వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ అదృష్టంపై ఆధారపడకుండా ఏకాగ్రత , పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల దిశగా పయనించేలా అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. సానుకూల దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం తథ్యమని సూచించారు. ఇతరులను నిందించడం మానుకొని మన ఎదుగుదలకు దోహదపడేలా ముందుకు సాగాలని హితవు పలికారు. సమాజానికి సరైన దశ, దిశ చూపే గురుతర బాధ్య త కలిగిన గురువులు విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. బండరాయిని ఓ శిల్పి ఎలాగైతే దేవతామూర్తి విగ్రహంగా చెక్కి పూజలందుకునేలా చేస్తాడో.. ఉపాధ్యాయులు సైతం అదే స్ఫూర్తితో విద్యార్థుల్లో సామాజిక స్పృహ, సానుకూల దృక్పధాన్ని పెంపొందిస్తూ చక్కని విద్యాబోధన అందించడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడాలన్నారు. కౌమర దశ ఎంతో సున్నితమైనదని ఈ వయస్సులోని పిల్లలను సరైన దిశగా ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.
చదువుకు ఏదీ అడ్డుకాదు
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు సైతం ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి చక్కటి నిదర్శనమన్నారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ తాను పుట్టి పెరిగిన ప్రాం తం, చదువుకున్న బడిని మరిచిపోకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పేరిట ట్రస్టును నెలకొల్పి అవార్డులు అందిస్తుండడం గొప్పవిషయమన్నారు. ఆర్మూర్‌లోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అదృష్టవంతులని వారికి కమిషనర్ పార్థసారథి రూపంలో తోడ్పాటు లభిస్తోందన్నారు. ఎస్సెస్సీ టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలల విద్యార్థులు శ్రీకృష్ణ, లక్ష్మీ వివేక్, బాలికల పాఠశాలకు చెందిన బి హరివర్థిని, సాహితీ, రాంమందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన విఘ్నేశ్, రోహిత్, జనార్ధన్ రాజశేఖర్, సైదాబాద్ ఉర్ధూ మీడియం పాఠశాలకు చెంది న షరియా ఫిర్ధోష్, రిముషా మహిన్లను అవార్డులతో సత్కరించి , ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్, ఎంఈవో రాజగంగారాం, ట్రస్టు కన్వీనర్ నర్సింలు, పాఠశాల హెచ్ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.