బాన్సువాడటౌన్, ఫిబ్రవరి 15: బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) గుర్తింపు రావడంతోపాటు తెలంగాణ యూనివర్సిటీ ఆమోదం లభించింది. అటానమస్ గుర్తింపు ఆదేశాల పత్రాన్ని టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ యాదగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్‌కు గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి గుర్తింపు రావడం ఆనందకరమన్నారు. కళాశాలలో బాన్సువాడతోపాటు చుట్టుపక్కల మూడు నియెజకవర్గాలు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. అటానమస్ గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తంచేస్తూ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.