మోర్తాడ్, జూన్ 24: ఇసుక అక్రమ రవాణాకు బాల్కొండ నియోజకవర్గం మారు పేరుగా మారింది. రెండేండ్లుగా ఈ ప్రాంతం అక్రమ దందాకు అడ్డాగా తయారైంది. ఇంకా అదే పరిస్థితి కొనసాగుతున్నదనడానికి చీతాఫోర్స్ వరుస దాడులే అందుకు నిదర్శనం. మండల స్థాయి రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉన్నప్పటికీ చీతాఫోర్స్ బృందాలే తరుచూ దాడులు చేస్తుండడం.. స్థానిక అధికారుల పనితీరుపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే అక్రమ దందా జరుగుతుండడం, అధికారులు ‘మామూలు’గా తీసుకుంటుండడం వల్లే ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో చీతాఫోర్స్ తరుచూ బాల్కొండ నియోజకవర్గంలోని ఇసుక పాయింట్ల వద్ద దాడులు జరుపుతూ ఇటు అధికారులు, అటు ఇసుకాసురులకు దడ పుట్టిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించిన చీతాఫోర్స్ 20 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు దాడులు చేసింది. జూన్ 1న ఏర్గట్ల మండలం తడ్పాకల్ గోదావరి సమీపంలోని పెద్దవాగులో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టిన జేసీబీని, ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నారు. జూన్ 14న మోర్తాడ్ మండలం శెట్పల్లి, ధర్మోరా గ్రామాల్లో చీతాఫోర్స్ దాడులు చేసి, అక్రమంగా ఇసుక తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 20న మెండోరా మండలం సావెల్తో పాటు వెల్కటూర్, ఏర్గట్ల మండలం బట్టాపూర్లలో చీతాఫోర్స్ బృందాలు దాడులు చేశాయి. అయితే, సావెల్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకున్నారు. కేవలం 20 రోజుల పరిధిలో మూడుసార్లు చీతాఫోర్స్ దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారంటే బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ దందా ఏస్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
నియోజకవర్గంలో జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నప్పటికీ, మండలస్థాయి అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా విషయంలో సూత్రధారులు, పాత్రధారులంతా అధికార పార్టీ నాయకులే కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదా? లేక మామూళ్లకు అలవాటు పడి కండ్లు మూసుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చీతాఫోర్స్ దాడులతో అధికారుల్లో కూడా గుబులు మొదలైంది. అయితే, మండల స్థాయిలో ఇసుక రవాణా జరుగుతున్న విషయం అందరికంటే ముందు అధికారులకే తెలిసే అవకాశం ఉన్నది. మరీ అలాంటప్పుడు ఏం జరిగి ఉంటుందనే విషయంలో ప్రజల్లో చర్చోపర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న క్వారీ వద్దే ఒక ట్రిప్పు ఇసుకకు అదనంగా రూ.700 చొప్పున మెయింటనెన్స్ కోసమని వసూలు చేస్తుండగా, అవి అధికారుల కోసమని కొందరు బాహాటంగా మాట్లాడుతుండడాన్ని బట్టి పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇక అక్రమంగా ఇసుక రవాణా జరిగే చోట ఎంత మొత్తంలో మామూళ్లు ముడుతాయో ఊహించుకోవచ్చు. అలాంటివి ఏమీ జరుగకపోతే చీతాఫోర్స్ వచ్చి దాడులు చేసే వరకు మండల అధికారులు ఆగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణా ప్రారంభానికి ముందే ఇసుకాసురులు అధికారులతో మాట్లాడుకుంటారని తెలిసింది. మోర్తాడ్ మండలంలో గాండ్లపేట్, శెట్పల్లి, ధర్మోరా గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగగా, పాలెం పెద్దవాగు నుంచి ప్రభుత్వ అనుమతితో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఏర్గట్ల మండలంలో బట్టాపూర్, తొర్తి గ్రామాల నుంచి ప్రభుత్వ అనుమతితో ఇసుక రవాణా జరుగుతుండగా, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గోదావరి నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. మెండోరా మండలంలో వెల్కటూర్ నుంచి ప్రభుత్వ అనుమతితో ఇసుక తవ్వకాలు కొనసాగుతుండగా, ఇక్కడ ఒకే వేబిల్లుపై పదుల సంఖ్యలో ట్రిప్పులు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సావెల్ పెద్దవాగు నుంచి కొన్ని నెలలుగా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా పట్టించుకునే వారే లేరన్న విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో.. చీతాఫోర్స్ దాడులతో అక్రమ దందాకు తాత్కాలికంగా అడ్డు పడిందని చెబుతున్నారు. చీతాఫోర్స్ దాడుల అనంతరం మెండోరాకు చెందిన ఇద్దరు రెవెన్యూ అధికారులను ఆర్మూర్ సబ్‌కలెక్టర్ పిలిపించుని ఆరా తీసినట్లు ప్రచారం జరగుతున్నది.
ఇసుక అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ మండల స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో భారీగా అక్రమ దందా సాగుతున్నా, చీతాఫోర్స్ అధికారులు దాడులు జరిపే వరకు మండలస్థాయి అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలను స్థానిక అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా చీతాఫోర్స్ దాడులు జరిగిన మండలాల్లో ఇసుక అక్రమ రవాణా విషయంలో అధికారుల తీరుపై కలెక్టర్ విచారణ జరిపించి చర్యలు చేపడితేనే అక్రమ దందాకు అడ్డుకట్ట పడే అవకాశముంది. అలాగే, ప్రభుత్వ క్వారీల్లో అదనపు వసూళ్లు ఎవరి కోసమన్న విషయంపైనా విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.