ధర్పల్లి, ఏప్రిల్ 3: పరీక్షా కేంద్రంలోనే ఓ అటెండర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామానికి చెందమేకల సాయిలు(55) పాఠశాలలో 2016 నుంచి అవుట్సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి పాఠశాలలో నైట్‌వాచ్‌మన్‌గా విధులు సైతం నిర్వహించాడు.
గురువారం ఉదయం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఒకేషనల్ పరీక్ష ఉండడంతో కేంద్రాన్ని సిద్ధం చేసే పనిలో ఉండగా ఛాతిలో నొప్పి వచ్చింది. వెంట నే వైద్యులను తీసుకురావాలని మరో అటెండర్ నారాయణకు చెప్పి కుప్పకూలి పడిపోయాడు. వైద్యుడు వచ్చి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సాయిలు మృతికి ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు రూ.25 వేలు అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.