బోధన్ రూరల్, మార్చి 2: సాలూర మండల కేంద్రంలోని మంజీరా నది శివారులో ఉన్న సాలూర ఎత్తిపోతల పథకం పంపుహౌస్ వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. ట్రాన్స్ఫార్మర్ చోరీకి యత్నించగా అడ్డుకున్న ఆపరేటర్, వాచ్‌మన్‌పై దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర ఎత్తి పోతల పథకం వద్దకు శనివారం రాత్రి 10 గంటల సమయంలో 8 మంది గుర్తు తెలియని దుండగులు వచ్చారు. అక్కడ కాపలాగా ఉన్న ఆపరేటర్, వాచ్‌మన్‌పై దాడి చేసి, వారి కాళ్లు కట్టేసి ట్రాన్స్ఫార్మర్ చోరీ చేసేందుకు యత్నించారు.
ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు. ట్రాన్స్ఫార్మర్ను వెల్డింగ్ చేసి బిగించడంతో ధ్వసం చేయడం సాధ్యంకాకపోవడంతో ఆపరేటర్, వాచ్‌మన్ ఫోన్లను ఎత్తుకొని పరారయ్యారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ ఎస్సై మశ్చేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గతంలో రెండుసార్లు ఎత్తి పోతల పథకం ట్రాన్ఫార్మర్ను దొంగిలించారని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. దుండుగులు మరాఠీ మాట్లాడడంతో దుండగులు మహారాష్ట్రకు చెందిన వారై ఉంటారని రైతులు భావిస్తున్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు.