నందిపేట్/ఖలీల్‌వాడి,నవంబర్ 22: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని, లోకల్ వార్ వన్ సైడేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ అనే నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ముందుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో కావడం తథ్యమని తెలిపారు.
కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ అయ్యిందని, రేవంత్ సర్కార్ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయని, దీంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతలు పెట్టేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు రెడీగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్‌రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని అన్ని గ్రామాలు నినదిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాల్లో కలిసిపోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీర్చలేని ఈ ప్రభుత్వం తమకెందుకని రైతులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. సగం రుణమాఫీ చేసి నిలువునా ముంచారని, రైతుబంధు ఇవ్వకుండా తమకు ద్రోహం చేశారని రైతులు మండిపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ దుర్బీతికి కేసీఆర్ పదేండ్ల ప్రగతి వైభవం మసకబారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో బుల్డోజర్ మాత్రం ఇంటింటికీ వచ్చి ప్రజల బతుకులను కూల్చివేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలన రాష్ట్ర ప్రజలకు స్వర్ణ యుగం కాగా.. రేవంత్ పాలన రాతి యుగాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. హామీ ఇవ్వకున్నా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చు పెట్టి కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల ఆగడాలే కనిపిస్తున్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నేతల దోపిడీ పర్వం కొనసాగుతున్నదని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తామని తెలిపారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎంను చేసే వరకు నిద్రబోమని పేర్కొన్నారు. పనికి మాలిన పార్టీల్లో బీఆర్ఎస్ విలీనం అంటూ చెత్తా ప్రచారం చేస్తున్నారని, విలీనం కాదు కదా ఏ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోబోమని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ అని, కాంగ్రెస్, బీజేపీలు, ప్రేతాత్మలు అని, అవి తెలంగాణకు పట్టిన శని గొట్టు పార్టీలని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ కోసం ప్రాణం ఇవ్వడానికైనా తాను సిద్ధమని జీవన్‌రెడ్డి తెలిపారు.
జిల్లాతో బీఆర్ఎస్ది పేగు బంధమని జీవన్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా మొదట పదవిని అందించిన చరిత్ర జిల్లాదేనని గుర్తు చేశా రు. సంతోష్‌రెడ్డిని జడ్పీ చైర్మన్‌ను చేసుకుని బీఆర్ఎస్ విజయానికి శ్రీకారం చుట్టిన చరిత్ర జిల్లాకు ఉన్నదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయడంలోనూ జిల్లాదే ప్రధాన పాత్ర ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.