ఖలీల్‌వాడి, జూన్ 23: జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక దురహంకారి, కుసంస్కారి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితపై అవాకులు చెవాకులా అని అర్వింద్‌పై జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
అవినీతి బురదగుంట ఫ్యామిలీలో పుట్టిన అర్వింద్‌కు నీతి, నియమంలేదని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీని తిట్టి పెద్ద నాయకుడివై పోవాలనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత కాలిగోటికి కూడా అర్వింద్ సరి పోడని పేర్కొన్నారు. బీజేపీనే రప్పా,రప్పా అని తెలంగాణ నుంచి తరిమి కొడతా రని హెచ్చరించారు. అర్వింద్ గుజరాత్ గులామ్ లా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా తెలంగాణ సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణ సూర్యుడని, ఆయనతో పెట్టుకుంటే అర్వింద్ మాడిమసికాక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.