కంఠేశ్వర్/ ఖలీల్‌వాడి, ఏప్రిల్ 25 : దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘చలో వరంగల్’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం జీవన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల చూపు వరంగల్ సభ వేపే ఉన్నదని తెలిపారు.
అంగరంగ వైభవంగా నిర్వహించనున్న గులాబీ పండుగ జనజాతర, తెలంగాణ ద్రోహులకు పాతరేస్తుందన్నారు. బీఆర్ఎస్ అసలు సిసలైన తెలంగాణ ఇంటి పార్టీ అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ సోయి లేని పరాయి పార్టీలని విమర్శించారు. బీఆర్ఎస్ తెలంగాణ రక్షణ కవచమని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న దగాకోరు విధానాలు, తెలంగాణ ప్రజలకు ప్రాణసంకటంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాక్షస పాలనపై వరంగల్ సభ యుద్ధభేరి మోగిస్తుందన్నారు. రాష్ర్టానికి శనిలా పట్టిన కాంగ్రెస్ అవినీతి చీడను, బీజేపీ మతోన్మాద పీడను వదిలించడానికి వరంగల్ సభ నాంది పలుకుతుందన్నారు.
మళ్లీ కేసీఆర్‌తోనే అభివృద్ధి సంక్షేమ రాజ్యం వస్తుందని, ఆయనను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చూసేందుకు రేవంత్ గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అనే నినాదంతో పని చేస్తామన్నారు. నియోజకవర్గంలో అవినీతి కాంగ్రెస్, అరాచక బీజేపీ అంతం ఆర్మూర్ ప్రజల పంతమని పోరాట కార్యాచరణను రూపొందించుకుని పోరాడుదామని ఆర్మూర్ నాయకులకు పిలుపునిచ్చారు. జిల్లా నుంచి ప్రజలు వరంగల్‌కు ప్రభంజనంలా తరలివెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని జీవన్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఆహ్వానిస్తూ ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి శుక్రవారం స్టిక్కర్లు అతికించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ వాల్‌పెయింటింగ్ కూడా వేశారు. రేవంత్ గోబ్యాక్ – కేసీఆర్ కమ్ బ్యాక్ అని గోడలపై రాసి బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు