తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో సాహిత్య దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, నిజామాబాద్‌లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర అనిర్వచనీయమైనదని.. స్వరాష్ట్రంలో వారికి సరైన గుర్తింపు దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు వినిపించిన కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కవులు, కళాకారులను సన్మానించారు.
ఖలీల్‌వాడి, జూన్ 11: తెలంగాణ సాధన ఉద్యమాల్లో సాహిత్యానిది కీలకపాత్ర అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన సాహిత్య దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కత్తికన్నా కలం గొప్పదన్నారు. కలం ప్రజా ఉద్యమాలకు బలం అని అభివర్ణించారు. తెలంగాణ పోరుతో కవులది విడదీయరాని బంధమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కీలక దశకు తీసుకెళ్లి చరిత్ర పుటలకెక్కిన ఘనత కవులు, కళాకారులదన్నారు.
వారి ఆటాపాటలు ఎన్నో పోరాటాలకు బాటలేశాయని గుర్తుచేశారు. కవిత్వం స్వరాష్ట్ర సాధన పోరుకు జవసత్వం ఇచ్చిందని తెలిపారు. ఆర్మూర్, నందిపేట్ ప్రాంతాల్లో రోజుల తరబడి సాగిన ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి కవులు, కళాకారుల సహకారాన్ని తానెప్పుడూ మర్చిపోనని అన్నారు. అన్యాయాలపై కలమెత్తిన కవులు నిజమైన యుద్ధవీరులని, పరాయి పాలకుల చెరలో మగ్గిన తెలంగాణ ప్రజల దీనత్వాన్ని లోకానికి చాటిన చరిత్ర సాహిత్యానిదేనన్నారు. తెలంగాణను దగా చేస్తున్న సమైక్య పాలకుల తీరుపై కలాలు నిప్పులు కురిపించాయని, ఉద్యమం చల్లబడే ప్రతి గడియలో కవిత్వం అగ్గి రగిలించిందన్నారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, బతుకమ్మ, బోనాలు, రాస్తారోకోలు, బంద్‌లు, వంటావార్పు లాంటివన్నీ కవిత్వంలో భాగమయ్యాయని, సబ్బండవర్ణాల వృత్తులన్నీ ఉద్యమ ప్రతీకలవడం వెనుక కవుల పాత్ర ఎనలేనిదని జీవన్‌రెడ్డి వాఖ్యానించారు.
ఉద్యమానికి ఊపు తెచ్చిన అనేక పాటలను ఎమ్మెల్యే గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కూడా గొప్ప సాహితీవేత్త అని, ఉద్యమనేతగా ‘చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ’ అంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నీటి కష్టాలను కేసీఆర్ తన సాహిత్యంలో ప్రస్తావించారని గుర్తుచేశారు. గడిబిడి చేస్తుండ్రు.. గారడీ చేస్తుండ్రు.. అనే పాట కూడా కేసీఆర్ రాసిందేనని తెలిపారు. కేసీఆర్ రాసిన పాటను ఆయనే స్ఫూర్తిగా తీసుకొని రూ.40వేల కోట్లతో లక్షా 46 వేల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధజలాన్ని సరఫరా చేయడమే కాకుండా నల్లగొండ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన గొప్ప నేత అని కొనియాడారు. అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ పాలన సాగుతోందని, దాశరథి చెప్పిన కోటి రత్నాల వీణను కోటి ఎకరాల మాగాణా మార్చిన కేసీఆర్.. అపర భగీరథుడని జీవన్‌రెడ్డి అభివర్ణిం చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా, సాహితీవేత్తలు పాల్గొన్నారు.