విద్యానగర్, నవంబర్ 26 : కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ స్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీలో పురోగతి,పర్యావరణ హితమైన పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, చారిత్రక అభివృద్ధి, మన కోసం గణితం తదితర అంశాలపై విద్యార్థుల ప్రాజెక్టులు తయారు చేశారు. జిల్లాలోని పలు పాఠశాలల నుంచి 610 సైన్స్ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. చదువుతో పాటు నూతన ఆవిష్కరణలు చేయడంవల్ల ఎందరో శాస్త్రవేత్తలు పుట్టుక వస్తారని అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసిన సైన్స్ ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి వారిని సన్మానించారు. అంతకుముందు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, డీఎస్వో సిద్ధిరాంరెడ్డి, సైన్స్ ఉపాధ్యాయులు, వివిధ కమిటీల కో-ఆర్డినేటర్లు, ఉపాధ్యాయ సంఘాలు, స్కౌట్ విద్యార్థులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.