ఆర్మూర్, ఏప్రిల్ 9: సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే సీఎం కేసీఆరే నా బలమని, బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలగమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని గురడిరెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని 18 గ్రామాల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కుటుంబాలతో సహా సమ్మేళనంలో భాగస్వామ్యులయ్యారు. సమ్మేళనానికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గేట్ వద్ద నిలబడి స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను పేరుపేరునా పలుకరించారు. మండల స్థాయి నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. పలు రకాల వంటలతో భోజనాలను ఏర్పాటు చేయగా, జీవన్‌రెడ్డి దగ్గరుండి వడ్డించారు. భోజన అనంతరం సమ్మేళానానికి హాజరైన వారితో జీవన్‌రెడ్డి దంపతులు మాట్లాడారు. కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకొని వారితో ఫొటోలు దిగారు. అనంతరం సమ్మేళానానికి హాజరైన మహిళలకు చీరలను అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..బీజేపీ డబులింజన్ సర్కార్, ప్రజలకు ట్రబుల్‌గా మారిందని.. కేసీఆర్ పాలన మానవీయ కోణంలో సాగుతుంటే మోదీ పాలన అవినీతి అవకాశవాద రాజకీయ, ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునే కోణంలో సాగుతోందని ఆయన ఆరోపించారు.
బీజేపీ దేశాన్ని కొల్లగొడుతున్నదని, ప్రజల సంపదంతా అదానీ పాలవుతుంటే మోదీ సర్కార్ నవ్వుల పాలవుతున్నదని విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలు మోదీకి చుట్టాలుగా మారాయన్నారు. బీఆర్ఎస్కు 62లక్షల సైన్యం ఉందని, బీజేపీ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ బెదరదన్నారు. కేసీఆర్ సైగ చేస్తే.. బీఆర్ఎస్ సైన్యం బీజేపీని తరిమికొడతారని, కేసీఆర్‌తో గోక్కున్నోడెవరూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్నారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పి, బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పి, రైతులకు పంగనామాలు పెట్టారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో ఆర్మూర్ ఎట్లుండేదో, ఇప్పుడు ఎలా ఉందో చర్చ జరగాలన్నారు. బీఆర్ఎస్ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు.
రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఆర్మూర్ ప్రజలు చైతన్యవంతులని, అర్వింద్ ఎక్కడ నిలబడ్డా డిపాజిట్ రాకుండా చేస్తారన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కార్యకర్తలు వారధిలా ఉండి సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మధుశేఖర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేసి చూపించారని, ఆయన బాటలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆర్మూర్‌ను అభివృద్ధి చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణను గుజరాత్ పెద్దలకు అప్పగించాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌ల అబద్ధాల కోరులన్నారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను స్వర్గంగా మార్చారన్నారు. ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మారగంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్ట సంతోష్, అంకాపూర్ సర్పంచ్ పూజితాకిశోర్రెడ్డి పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారు..
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ్ల ప్రకాశ్ ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో దేశమంతా పర్యటించానని, బీసీలకు ఎక్కడా సముచిత స్థానం లేదని, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఆదర్శనీయుడు కేసీఆర్ అని కొనియాడారు.