నందిపేట్, ఏప్రిల్ 28 : సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ వెంటే ఉన్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దేవుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో నికాల్పూర్ గ్రామ లిఫ్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు జీలకర చిన్నయ్య, వైస్‌చైర్మన్ సాయిలు, లిఫ్ట్ డైరెక్టర్లు సుమన్, లంబాడి గంగారాం, శాల చిన్నముత్తెన్న, సుంకరి పెద్ద చిన్నయ్య, పస్క పెద్ద గంగారాం, నాగరాజు, గొల్ల శ్రీకాంత్, తెనుగు చిన్నగంగారాం, సంతోష్, బద్దం సాయిరెడ్డితోపాటు వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వారికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా బీఆర్ఎస్లో చేరినట్లు వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామన్నారు. ఏమీ ఇవ్వని మోదీయే దేవుడైనప్పుడు తెలంగాణ ప్రజలకు 450 సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న కేసీఆర్ దేవుడు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజమంతా సీఎం కేసీఆర్ వైపే ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలిస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పీడించే భూతాలుగా మారాయని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వమే దేశ ప్రజలకు భరోసా అని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన నచ్చడంతో దేశ వ్యాప్తంగా పార్టీలోకి వలసల వరద కొనసాగుతోందన్నారు. కేసీఆర్ దేశానికి కాబోయే ప్రధాని అని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న కేసీఆర్ దేవుడని అన్నారు.
దేశాన్ని అడ్డీకి పావు శేరున అమ్ముతున్న మోదీ దుర్మార్గుడన్నారు. బీజేపీది మున్నాళ్ల ముచ్చటేనన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. అదానీ మరో హర్షద్ మెహతా అయ్యారని అన్నారు. దేశ సంపదను మోదీ ప్రోద్బలంతో అదానీ ఆవిరి చేస్తున్నారని మండిపడ్డారు. తరతరాలుగా అభివృద్ధికి నోచుకోక అంధకారంగా మారిన ఆర్మూర్ నియోజకవర్గాన్ని తాను ఈ తొమ్మిదేండ్ల కాలంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, నికాల్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెల్మల్ రాజన్న, సురేశ్, బీఆర్.గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.