బాల్కొండ, అక్టోబర్ 22 : సంచలనం సృష్టించిన మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు చోరీ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ కేఆర్.నాగరాజు వివరాలను వెల్లడించారు. మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో జూలై 4న జరిగిన బ్యాంకు చోరీ కేసులో మరో నిందితుడు సలీం (ఏ4)ను పట్టుకున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బీరెల్లి జిల్లాకు చెందిన నిందితుడు సలీం లారీ క్లీనర్‌గా మహారాష్ట్రలోని నాగపూర్ వాడి వద్ద జాన్సన్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్మూర్ సీఐ గోవర్ధన్ పోలీసులతో అక్కడికి వెళ్లారు. సలీం లారీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరిస్తూ మిగతా నిందితుల వివరాలు వెల్లడించాడు. నిందితులంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌ, బరేలీ జిల్లాలకు చెందిన వారు. ముఖ్యంగా కక్రాల జిల్లాకు సంబంధించిన వారున్నారు.
వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. చోరీలు చేసిన అనంతరం సొమ్మును పంచుకుని ఎవ రూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా అందరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. దొంగతనం చేయడానికి ముందు టార్గెట్ చేసిన ప్రాంతానికి సాదిక్, రాజారాం వెళ్లి ఆ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు, బ్యాంకు సమీపంలో ప్రజల సంచారం తదితర విషయాలను గమనించి టీం లీడర్ షారుక్‌ఖాన్‌కు సమాచారం అందిస్తారు. అనంతరం 20 మంది విడివిడిగా వస్తారు. లారీలో గ్యాస్ కట్టర్, దొంగతనానికి ఉపయోగించే సామగ్రిని తీసుకువస్తారు. కొంతమంది ఇన్నోవా కార్లు, మరికొంతమంది రైలు ద్వారా అక్కడికి చేరుకుంటారు.
దొంగతనం చేసిన తర్వాత టోల్‌ప్లాజాకు చిక్కకుండా వేరే మార్గాల్లో ఉడాయిస్తారు. లారీలో గుజరాత్‌కు బంగారు అమ్మడానికి రెండుసార్లు వెళ్లినట్లు ఫోన్‌కాల్ ద్వారా తెలియడంతో శనివారం లారీ డ్రైవర్ సలీంను అదుపులోకి తీసుకుని 116 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఏసీపీ ఆర్.ప్రభాకర్, రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి బృందం ముఖ్యపాత్ర పోషించి బ్యాంకు చోరీ కేసును ఛేదించినట్లు తెలిపారు. నిందితులు కత్తులు, తుపాకుల సహాయంతో నేరాలు చేస్తారని తెలిపారు. గతంలో తమిళనాడులోని కృష్ణగిరి, ఖమ్మం జిల్లాలోని దమ్ముగూడం, కరీంనగర్ జిల్లాలోని మంథని, కుమ్రం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్, కర్ణాటకలోని గుల్బర్గాలో బ్యాంకు దోపిడీలకు పాల్పడి కిలోలకొద్దీ బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. నేరస్తులు షారుక్‌ఖాన్, ఫతిమహ్మద్కాన్, రాజు, సాదిక్‌ఖాన్, యూసుఫ్‌ఖాన్, నయీమ్‌ఖాన్, మెహరాజ్, సలీం, గుడ్డు, ఇర్ఫాన్, జగ్ను, పర్వేజ్, సాబూల్, మునీష్, హఫీషా, అఘాఖాన్, రాజారామ్‌ను ముఠా సభ్యులుగా గుర్తించామన్నారు. వీరిలో ఏ-3 నిందితుడైన రాజును పోలీసులు పట్టుకుని విచారించగా నేరస్తుల వివరాలన్నీ బయటపడినట్లు కమిషనర్ తెలిపారు. కేసును ఛేదించిన ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు, సీఐ గోవర్ధన్‌రెడ్డి, మెండోరా ఎస్సై శ్రీనివాస్, బాల్కొండ ఎస్సై గోపి, వేల్పూర్ ఎస్సై వినయ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, కమ్మర్పల్లి ఎస్సై రాజశేఖర్, టీమ్ సభ్యులకు సీపీ అభినందించారు.