శక్కర్‌నగర్, జనవరి 2 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ హత్య జరిగిన 24 గంటలు గడవకముందే బోధన్ పట్టణంలో మరో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ శివారులోని శక్కర్‌నగర్-నర్సాపూర్ రహదారి పక్కన బోధన్ పట్టణానికి చెందిన చాట్ల శివ (23) దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పరిసర ప్రాంతాలకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ పట్టణ సీఐ బీడీ ప్రేమ్‌కుమార్, ఎస్సై నవీన్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి అనుకున్నా, మృతుడి చేతిపైన ఉన్న పచ్చబొట్టుతో అతని పేరుతో పాటు అమ్మ అని రాసి ఉండడంతో స్థానికంగా పోలీసులు విచారణ జరుపగా యువకుడు పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన చాట్ల శివగా నిర్ధారించారు. యువకుడి ముఖంపై, గొంతులో పదునైన ఆయుధంతో పొడవడంతో పాటు చేతి నరాలు కోసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ నెల ఒకటో తేదీన హత్యకు పాల్పడి ఉంటారని మృతుని తండ్రి చాట్ల గోపి పోలీసులకు తెలిపాడు. పోలీసులు డాగ్‌స్కాడ్, క్లూస్‌టీమ్‌తో సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి చాట్ల గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ పట్టణ సీఐ బీడీ ప్రేమ్‌కుమార్ తెలిపారు. కాగా శివపై రౌడీ షీట్ ఉన్నదని సీఐ తెలిపారు.