నిజామాబాద్, జనవరి 3 , (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో రైతును ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా రైతుకు కొండంత అండగా నిలుస్తున్నది. సాగుకు పెట్టుబడి సాయం అందించడంతో మొదలు పంట కొనుగోళ్ల దాకా భరోసాను కల్పిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం సందు దొరికితే రైతుపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నది. 8 ఏండ్ల బీజేపీ పాలనలో రైతులకు చేసిన ఒక్క మేలు లేకపోగా కీడు మాత్రం చెప్పనక్కర్లేదు. తాజాగా మక్కజొన్న విత్తన సంచులపై మరింత భారాన్ని మోపడం ద్వారా రైతుకు తీవ్రమైన ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మోదీ సర్కారు అనాలోచితమైన నిర్ణయంతో సాగుదారులు అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. డీజిల్ ధరలను రూ.వంద దాటించడం ద్వారా రెండేండ్ల నుంచి సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. విత్తనాలు, ఎరువుల విషయంలో ప్రతి సీజన్‌కు ముందు ఏదో ఒక రూపంలో మోదీ సర్కారు ఉపద్రవం తీసుకువస్తున్నది. ఇప్పుడు మక్కజొన్న రూపంలో నాలుగు కిలోల సంచికి రూ.300 చొప్పున అదనపు భారాన్ని మోదీ ప్రభుత్వం మోపింది.
ఎకరానికి రూ.వేయి అదనపు భారం…
సాధారణంగా వానకాలం నష్టాలను భర్తీ చేసుకునేందుకు రైతులు యాసంగిలో మక్కజొన్న సాగు కు ప్రాధాన్యం ఇస్తారు. వానకాలంలో పెసర, వరి వేసిన రైతులు యాసంగిలో మక్కజొన్న వేస్తుండ గా పత్తి సాగు చేసిన వారు సాగుకు సిద్ధం అవుతున్నారు. మక్కల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తుండగా విత్తన కంపెనీలు ధరలను అమాంతం పెంచాయి. రైతులు అధికంగా వినియోగించే కొన్ని సంస్థల విత్తనాలు దొరకడం కష్టమేనంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ముందుగానే ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అసలే దుక్కి, కూలీలు, ఇతర ఖర్చులు పెరిగి పెట్టుబడి భారంగా మారిన సమయంలో విత్తన ధరలు పెరగడం రైతు నెత్తిన పిడుగు పడినట్లు అవుతున్నది. గతేడాది నాలుగు కిలోల సంచి ధర రూ.1200 ఉండగా ప్రస్తుతం రూ.1500 వరకు పెరిగింది. అన్ని సంస్థల విత్తన ధరలు కూడా ఇదే విధంగా ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి విత్తన ఖర్చు రూ.900 వరకు పెరిగినట్లయ్యింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అధికారుల సాగు విస్తీర్ణం అంచనాల ప్రకారం చూసుకుంటే మొత్తం భారం ఏకంగా రూ.కోట్లలోనే ఉండనున్నది. రైతులు అధికంగా అడిగే విత్తనాన్ని కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి లబ్ధి పొందేందుకు చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాపంగా మారిన బీజేపీ ప్రభుత్వం…దేశంలోని రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శాపంగా దాపురించింది. మక్కజొన్న సాగు చేస్తున్న వారిని కేంద్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. అందివచ్చిన లాభాలను లాగేసుకునేలా చర్యలకు ఎగబడుతున్నది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మక్కజొన్నకు భారీ డిమాండ్ ఉంది. దీంతో లాభాలు వస్తాయని రైతులు అనుకునే లోపు కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి రైతులపై ప్రతాపం చూపుతోంది. డిమాండ్ భారీగా ఉండడంతో విదేశాలకు మక్కజొన్న ఎగుమతులు పెరిగాయి. దీంతో ప్రస్తుతం మక్క క్వింటాలుకు రూ.2200 నుంచి రూ.2500 వరకు పలుకుతున్నది. ఇలాంటి సమయంలో ఎగుమతులను నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే మక్కజొన్న ధర పడిపోయి రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. రైతులకు మేలు జరిగే సమయంలో ఎగుమతులను నిషేధించాలన్న ఆలోచన సరైంది కాదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రైతుల పొట్ట కొట్టి… కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగుతున్నదని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.1962గా ఉన్నది. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో క్వింటాలుకు రూ.రెండున్నర వేల వరకు చేరుకున్నది.
అధికంగానే మక్కజొన్న సాగు…
నిజామాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో మక్కజొన్న సాధారణ విస్తీర్ణం 16,334 ఎకరాలుగా ఉంది. గతేడాది ఇదే యాసంగికి 12,493 ఎకరాల్లో సాగైంది. ఈసారి 20వేల ఎకరాల్లో మక్కజొన్న సాగవుతుందని అంచనాలున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే ప్రస్తుతం సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగానే మక్కజొన్న సాగుకు నోచుకున్నది. 105శాతం మేర మక్క సాగవ్వగా ఇందులో సగానికి ఎక్కువగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోనే ఉంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. కనికరం లేకుండా ఎడాపెడా పెంచిన ఇంధన ధరలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. నిత్యవసరంగా మారిన ఇంధన ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో సామాన్య ప్రజలతో పాటు అన్నదాతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. 2020 జూన్‌లో డీజిల్ రూ.69.15 ఉండగా ఇప్పుడు లీటర్ రూ.102.06 చేరింది. ఇంతటి పెను భారంతో వ్యవసాయ ఖర్చు లు పెరుగుతున్నాయి. వరి సాగు చేసే రైతుపై ఏడాదికి ఎకరానికి అదనంగా రూ.3వేల నుంచి రూ.3,500 వరకు ఖర్చు అవుతున్నది. ఈ పాపానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే ప్రధాన కారణం.
విత్తన ధరలు పెంచడం బాధాకరం
కేంద్ర ప్రభుత్వం మక్కజొన్న విత్తన ధరను పెంచడం బాధాకరం. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా విత్తన ధరలను మాత్రం పెంచడంతో రైతులకు పెనుభారంగా మారుతున్నది.
-తాడ్వాయి సాయిలు, రైతు, గాంధారి
రైతులపై అదనపు భారం..
రైతు ప్రభుత్వమని చెప్పుకునే కేంద్రం మక్కజొన్న విత్తనాల ధరలను పెంచడంతో రైతులపై అదనపు భారం పడుతుంది. రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం విత్తనాల ధరలను పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నది.
-ఉప్పు సాయులు, రైతు, గండివేట్