కరీంనగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్: ‘ఓడెక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభ ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతోపాటే జీతాలు విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చింది. తీరా గెలిచిన తర్వాత జీతాలు పెంచడం దేవుడెరుగు? ఉన్న జీతాలు కూడా సక్రమంగా ఇవ్వ డం లేదు. ఫలితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రెండు నెలలుగా జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ, ఆరేండ్లలోపు బాలలకు ఆటాపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. అయినా నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. వేతనాలు పెంచాలని అనేక ఆందోళనలు చేసినపుడల్లా కంటితుడుపుగా వందో.. రెండొందలో పెంచేవారు. అవి ఏ మూలకూ సరిపోయేది కాదు. కానీ, కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. కీలక సేవలందిస్తున్న అంగన్వాడీలకు సముచిత స్థానం కల్పించింది. కేంద్రంతో సంబంధం లేకుండా ఈ చిరుద్యోగుల సంక్షేమాన్ని చూసుకున్నది. తెలంగాణ వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్లకు కేవలం 3,200, హెల్పర్లకు ఇంకా తక్కువ వేతనం ఉండగా, రాష్ట్రం వచ్చిన వెంటనే వీరికి వేతనాలు పెంచింది. టీచర్లకు నెలకు 13,650, హెల్పర్లకు 7,800 వేతనం అందించింది. ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా వేతనాలు పెంచలేదు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్నట్టుగా రెండు సార్లు పీఆర్సీ అమలు చేసింది. అయితే కరోనా విపత్కర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. సంక్షేమాన్ని మాత్రం ఆపలేదు. ఉద్యోగులకు వేతనాలు కాస్త ఆలసమయ్యాయి కానీ, ఏ నెల కూడా వేతనాలను ఆపలేదు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని, ప్రభుత్వోద్యోగులతో కలిపి ఏనెలకు ఆ నెల ఒకటో తారీఖున విడుదల చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 75 రోజులు గడిచింది. కానీ, ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలు విడుదల చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35వేల సెంటర్లలో పనిచేస్తున్న దాదాపు 65 వేల అంగన్వాడీలు రెండు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. జీతాలు పెంచడమేమో గానీ, ఉన్న జీతాలు కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏరు దాటినంక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నదని తీవ్రస్థాయిలో ద్వజమెత్తుతున్నారు. జీతాలు లేక తమ కుటుంబాల పరిస్థితి కడుదయనీయంగా మరిందని, అప్పులు చేయాల్సి వస్తున్నదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తామ గోడు వెళ్లబోసుకునేందుకు కనీసం కాంగ్రెస్ నాయకుల సమయం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే జీతాలు విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.